బద్వేల్ ఉప ఎన్నికల మూడ్ ని ఉపయోగించుకుని వచ్చే ఎన్నికల వరకు జనంలో ఉండాలనేది సీఎం జగన్ ఆలోచన. రచ్చబండ కానీ, సచివాలయాల సందర్శన కానీ.. అన్నిటికీ బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం నుంచే శ్రీకారం చుట్టాలనుకున్నారు. కానీ జగన్ దూకుడికి పవన్ అడ్డుకట్ట వేసినట్టయింది.
అవును, బద్వేల్ లో జనసేన తరపున అభ్యర్థిని బరిలో దింపకూడదని పవన్ నిర్ణయం తీసుకున్నారు, ఆయన్ను చూసి చంద్రబాబు కూడా వెనక్కి తగ్గారు.
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేక, ఇటీవల విమర్శలకు పదును పెట్టిన పవన్ కూడా వెనక్కు తగ్గాక ఇక ఉప ఎన్నికల్లో మజా ఏముంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు పోటీగా జగన్ ప్రచారానికి ఎందుకొస్తారు..? అందుకే ఆయన ఆగిపోయారు. అలా జగన్ ఉత్సాహంపై పవన్ నీళ్లు చల్లారు.
తెలివిగా వెనక్కు తగ్గిన పవన్..
బద్వేల్ లో జనసేన అభ్యర్థి పోటీ చేసినా, బీజేపీ అభ్యర్థికి తాను ప్రచారం చేసినా ఏం జరుగుతుందో పవన్ కి బాగా తెలుసు. అందులోనూ రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో ఆయన ఆవేశంగా మాట్లాడి రోజులు కూడా గడవలేదు. ఈ దశలో బద్వేల్ లో బొక్కబోర్లా పడితే జనం నవ్వుతారు, అభిమానులు బాగా హర్ట్ అవుతారు.
ఒక్కసారిగా పవన్ కిందపడినట్టవుతుంది. అందుకే ఆయన పలాయనవాదం చిత్తగించారనే ప్రచారం జరుగుతోంది. పవన్ చూపిన దారిలో చంద్రబాబు కూడా హమ్మయ్య అనుకుంటూ ఎస్కేప్ అయ్యారు.
జగన్ డిజప్పాయింట్ మెంట్..
తిరుపతి ఉప ఎన్నికల్లో కరోనా వల్ల పోల్ పర్సెంటేజ్ తగ్గే సరికి వైసీపీ అభ్యర్థికి అనుకున్న స్థాయిలో మెజార్టీ రాలేదు. అదే సమయంలో టీడీపీకి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు వచ్చాయి. దీనికి బద్వేల్ లో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు జగన్. ముందుగానే మంత్రి పెద్దిరెడ్డితో పెద్ద టీమ్ రెడీ చేశారు. మండలానికో ఎమ్మెల్యేకి బాధ్యతలు అప్పగించి రంగంలోకి దింపారు. చివరిగా తాను కూడా ప్రచారానికి వచ్చి, అట్నుంచి అటే 2024 ఎన్నికల సమర శంఖారావం పూరించి, పూర్తిగా జనంలోనే ఉండాలని అనుకున్నారట జగన్.
కానీ చప్పగా సాగబోతున్న బద్వేల్ ఉపపోరు, జగన్ ఆలోచనలను మార్చేసింది. పోయిపోయి పోటీలో లేని టీడీపీ, జనసేనను విమర్శించలేరు. అలాగని కాంగ్రెస్, బీజేపీ పేరు ప్రస్తావించినా అది అంతకంటే ఘోరంగా ఉంటుంది. అందుకే జగన్ బద్వేల్ ఉపపోరుని బాగా లైట్ తీసుకున్నారట. బాధ్యత మొత్తం మంత్రి పెద్దిరెడ్డికే అప్పగించి, ఇతర వ్యవహారాల్లో మునిగిపోయారట.