హలో.. హలో.. చంద్రబాబుని గుర్తు చేస్తున్న పవన్

గ్రేటర్ లో బీజేపీ సాధించిన సీట్లపై ప్రెస్ నోట్ విడుదల చేసిన పవన్ కల్యాణ్ మరోసారి బాబుని గుర్తు చేసి కామెడీ పండించారు. ఏదైనా హడావిడి మీటింగ్ లో ఉన్నప్పుడు.. చంద్రబాబుకి ఆయన అసిస్టెంట్…

గ్రేటర్ లో బీజేపీ సాధించిన సీట్లపై ప్రెస్ నోట్ విడుదల చేసిన పవన్ కల్యాణ్ మరోసారి బాబుని గుర్తు చేసి కామెడీ పండించారు. ఏదైనా హడావిడి మీటింగ్ లో ఉన్నప్పుడు.. చంద్రబాబుకి ఆయన అసిస్టెంట్ ఫోన్ తెచ్చి చేతిలో పెడతారు. 

ప్రధాని మోదీ లైన్లో ఉన్నారనో, లేక అమిత్ షా మీతో మాట్లాడాలనుకుంటున్నారనో బిగ్గరగా చెబుతాడు. ఆ తర్వాత కథ మనకు తెలిసిందే.

మోడీ తనతో ఫోన్ లో చెప్పారంటూ.. బాబు తన మనసులో ఉన్న మాటలు మీడియాకు చెప్పేస్తారు. ఇంకేముంది అనుకూల మీడియా దాన్ని బ్యానర్లో వేసేస్తుంది. సరిగ్గా గ్రేటర్ ఎన్నికల ఫలితాల రోజు కూడా ఇలాంటి డ్రామాయే నడిపారు పవన్ కల్యాణ్.

పవన్ నెల్లూరు మీటింగ్ లో ఉన్నారు. సార్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లైన్లో ఉన్నారంటూ అసిస్టెంట్ ఫోన్ తెచ్చిచ్చాడు. ఇంకేముంది పవన్ కల్యాణ్ సినిమా స్టైల్ లో ఫోన్ అందుకుని మాట్లాడేసి వచ్చారు. కట్ చేస్తే.. ప్రెస్ నోట్ లో పవన్ కల్యాణ్ మనసులో ఉన్న మాటలన్నీ కిషన్ రెడ్డి చెప్పినట్టు రాసుకొచ్చారు పవన్.

జనసేన పార్టీ నేతలకు, కార్యకర్తలకు కిషన్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారని, గ్రేటర్ ఎన్నికల్లో కలసి పనిచేసినందుకు తమ విజయంలో పాలుపంచుకున్నందుకు అభినందించారని చెప్పారు. అంతే కాదు, భవిష్యత్తులో తెలంగాణలో కూడా బీజేపీ, జనసేన కలసి పనిచేస్తాయని కిషన్ రెడ్డి తనతో చెప్పినట్టు పవన్ ప్రెస్ నోట్ లో చెప్పారు.

పనిలో పనిగా పవన్ కల్యాణ్ కూడా తెలంగాణ బీజేపీకి శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీ విజయానికి జనసైనికుల కృషి కూడా తోడయిందని, ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారని, కేంద్ర నాయకుల ర్యాలీల్లో కూడా జనసైనికులు ముందు వరుసలో ఉన్నారని, బీజేపీ విజయంలో జనసేనదే కీలక భూమిక అని ఏవేవో చెప్పేశారు.

60 స్థానాల్లో పోటీకి సిద్ధమైన జనసైనికులు, బీజేపీతో పొత్తులో భాగంగా ఆయా సీట్లను త్యాగం చేశారని, బీజేపీ గెలుపుకోసం కష్టపడ్డారని, వారి శ్రమకు తగ్గ ఫలితం లభించిందని, అలా త్యాగం చేసిన త్యాగమూర్తులందరినీ పార్టీ గుర్తు పెట్టుకుంటుందని భవిష్యత్తులో మంచి అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తామని అన్నారు పవన్.

మొత్తమ్మీద ఫోన్ డ్రామాలో పవన్ కల్యాణ్ చంద్రబాబునే మరిపించారు. గ్రేటర్ విజయం జనసేన చలవేనంటూ ఆసక్తికర చర్చకు తెరతీశారు.

చంద్రబాబు మీద కోపంతో అమూల్‌ను‌ తేలేదు