ఇటు తిట్టాలి, అటు పొగడాలి.. పవన్ కు ఎంత కష్టం

గతంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలంటే ఒంటికాలిపై లేచేవారు పవన్ కల్యాణ్. జగన్ రెడ్డీ.. జగన్ రెడ్డీ అంటూ దీర్ఘాలు తీస్తూ తన జలసీని బైటపెట్టుకునేవారు. బీజేపీతో జట్టుకట్టిన తర్వాత పవన్ కి బాధ్యతలు పెరిగాయి.…

గతంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలంటే ఒంటికాలిపై లేచేవారు పవన్ కల్యాణ్. జగన్ రెడ్డీ.. జగన్ రెడ్డీ అంటూ దీర్ఘాలు తీస్తూ తన జలసీని బైటపెట్టుకునేవారు. బీజేపీతో జట్టుకట్టిన తర్వాత పవన్ కి బాధ్యతలు పెరిగాయి. కేవలం జగన్ మోహన్ రెడ్డిని మాత్రమే విమర్శిస్తే సరిపోదు. అదే టైమ్ లో పీఎం మోదీ భజన కూడా చేయాలి. ఈ రెండు పనుల్నీ బ్యాలెన్స్ గా చేసుకోవాలి కాబట్టే.. ఇటీవల పవన్ కల్యాణ్ ఎక్కువగా మీడియా ముందుకు రాలేదు, ట్విట్టర్ లో కూడా యాక్టివ్ గా లేరు. 

జగనన్న విద్యా కానుక ద్వారా ఆ రెండు పనులు కలసి రావడంతో పవన్ రెచ్చిపోయారు. తన అక్కసుని వెళ్లగక్కారు. అది జగన్ గారి కానుక కాదు.. మోదీ-జగనన్నగారి కానుక అంటూ తన పైత్యాన్ని బైటపెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని, అయితే వాటికి జగన్ పేరు మాత్రమే పెట్టుకుంటున్నారనేది పవన్ ఆక్రోశం.

బీజేపీ నేతలు కూడా ఈ స్థాయిలో దిగులు పడలేదు. మరి పవన్ కల్యాణ్ కి ఎందుకంత ఇబ్బంది కలిగిందో కానీ.. సడన్ గా ట్విట్టర్లో బైటకొచ్చి.. అది మోదీ-జగనన్న గారి కానుక.. దాన్ని కేవలం మీ కానుకగా ఇస్తే బాగోదు అంటూ చెప్పేశారు. విద్యాకానుకలో ఇచ్చే వస్తువులకు 60శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తోందని, కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిధులు 40శాతమే ఉన్నాయంటూ లాజిక్ తీశారు, కాకి లెక్కలు కూడా సాక్ష్యాలుగా పోస్ట్ చేశారు.

అసలీ గొడవ మొదలు కాగానే.. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగనన్న విద్యాకానుక కిట్ లో ఉన్న ప్రతి వస్తువు వందశాతం రాష్ట్ర నిధులతో కొనుగోలు చేసిందేనని చెప్పారు. తాను చెప్పిన మాటలు తప్పు అని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనంటూ సవాల్ విసిరారు. మరి పవన్ కి ఈ సవాల్ వినపడిందా, లేక ఆయన చెవిన పడాలంటే మంత్రులు కూడా ట్వీట్ చేసి, పవన్ ని ట్యాగ్ చేయాలా?

ఆమధ్య కరోనా కష్టకాలంలో జగన్ ప్రభుత్వ పనితీరుని మెచ్చుకుంటే.. అక్కసు తీరిపోయిందని అనుకున్నారు. కానీ జగన్ పై పవన్ కడుపుమంట.. అప్పుడప్పుడు ఇలా బైటపడుతూనే ఉంది. పనిలో పనిగా మోదీని పొగిడే బాధ్యత కూడా బీజేపీ నేతల కంటే ఎక్కువగా తానే భుజానికెత్తుకున్నారు జనసేనాని. అందుకే మోదీ పేరు చేర్చాలని పట్టుబడుతున్నారు. బీజేపీ నేతలు తనపై పెట్టిన బాధ్యతను సంపూర్ణంగా నిర్వహిస్తున్నారు. 

విశాఖ మీద ఆ సామాజిక వర్గం పట్టు ఉంటుందా