జనసేనాని పవన్‌కల్యాణ్ జనాన్ని విసిగిస్తున్నారా? పదేపదే అవే మాటల్ని చెబుతూ బోర్ కొట్టిస్తున్నారా? అంటే… కాదనే వాళ్లెవరు? ఆంధ్రా, తెలంగాణ …ప్రాంతమేదైనా, పవన్‌కల్యాణ్ మాత్రం ఒకే రకంగా మాట్లాడ్డం గమనార్హం. తాను చెప్పేదానికి, ఆచరణకు పొంతన లేకపోవడంతో చివరికి జనసైనికులు కూడా ఉస్సూరుమని నిట్టూర్చుతున్నారు.
హైదరాబాద్‌లో శనివారం జనసేన కార్యకర్తలతో పవన్‌కల్యాణ్ సమావేశమయ్యారు. పవన్ మాట్లాడుతూ తలకాయ ఎగిరిపోతుందా, ఓడిపోతామా, గెలుస్తామా? అని ఆలోచించలేదన్నారు. కులం, మతం, రంగు, ప్రాంతం మనకు తెలియకుండా జరిగిపోతాయన్నారు. కులాలను రెచ్చగొట్టడం తన ఉద్దేశం కాదన్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన పవన్‌కల్యాణ్ ఇంతకంటే భిన్నంగా ఉపన్యసించలేదనే విషయాన్ని జనం గుర్తు చేస్తున్నారు. ఒకవైపు కులాలను రెచ్చగొట్టడం తన ఉద్దేశం కాదంటూనే, మరోవైపు తన సామాజిక వర్గమైన కాపులు పెద్దన్న పాత్ర పోషిం చాలని ఇటీవల ఆయన రాజమండ్రిలో పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రజలు తనను పిలిచే వరకూ ఇక్కడికి రానని పవన్‌కల్యాణ్ స్పష్టం చేయడం వింతల్లోకెల్లా వింత. కొండంత రాగం తీసి… చెత్తపాట పాడిన చందంగా పవన్‌కల్యాణ్ వైఖరి ఉందంటూ జన సైనికులు మండిపడుతున్నారు.
జనసైనికులను ఉత్సాహపరుస్తారని మీటింగ్‌కు ఆహ్వానిస్తే, తాను రానని ప్రకటించడం ఏంటనే నిలదీతలు వస్తున్నాయి. అసలు 2014లో జనసేన పార్టీని పెట్టాలని ఏ ప్రజలు ఆయన్ను పిలిచారు? అని ప్రశ్నిస్తున్నారు. తాను గందరగోళంలో ఉంటూ, తమను కూడా అదే పంథాలో నడిపిస్తున్నారని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ ఎవరైనా పిలిచారనే అనుకుందాం…మరి ఆయన్ను ఎక్కడ ఆదరించారనే ప్రశ్నకు ఏం సమాధానం చెబుతారు? రాజకీయాల్లో ఇప్పటికీ తనకు స్పష్టత లేదనే సంగతి తాజా వ్యాఖ్యానాలే నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ పోరాట స్ఫూర్తి తన గుండెలో ధైర్యాన్ని నింపిందని పవన్ ప్రకటించడం వరకూ బాగానే ఉంది. ఆ స్ఫూర్తితో తాను చేసిందేంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.