జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ పరంగా తీసుకునే విధానపరమైన నిర్ణయం మొత్తం ఏపీకి వర్తించదా అన్న చర్చ మొదలైంది. గత నెల 30న బద్వేల్ ఉప ఎన్నిక జరిగింది. నాడు పవన్ మాట్లాడుతూ దివంగత నేత కుటుంబ సభ్యులకు సానుభూతిగా తన పార్టీ తరఫున పోటీ చేయమని ప్రకటించారు. దానిని అంతా బాగా ఉందని అన్నారు.
ఇక ఇపుడు చూస్తే విశాఖ మహా నగర పాలన సంస్థలో రెండు వార్డులకు ఉప ఎన్నికలు వచ్చి పడ్డాయి. ఈ ఏడాది మొదట్లో టీడీపీ, వైసీపీ నుంచి గెలిచిన ఇద్దరు కార్పోరేటర్లు గట్టిగా రెండు నెలలు కూడా తిరగకుండానే మృతి చెందారు. 31వ వార్డునకు చెందిన టీడీపీ కార్పోరేటర్ వానపల్లి రవికుమార్ కరోనా బారిన పడి మరణిస్తే, 61వ వార్డుకు చెందిన దాడి సూర్యకుమారి గుండెపోటుతో చనిపోయారు.
అయితే ఏపీలో ఢీ అంటే ఢీ కొట్టే వైసీపీ, టీడీపీ ఇక్కడ మాత్రం పరస్పర సానుభూతిని ప్రకటించుకుంటూ పోటీ నుంచి వైదొలగాయి. అంటే 31వ వార్డులో వైసీపీ పోటీకి పెట్టలేదు, 61వ వార్డులో టీడీపీలో బరిలో లేదు. చిత్రమేంటి అంటే ఈ రెండు చోట్ల మాత్రం జనసేన అభ్యర్ధులు నామినేషన్లు వేశారు.
రెండు చోట్లా కూడా మరణించిన వారి కుటుంబ సభ్యులే పోటీకి ఉన్నారు. మరి పవన్ బద్వేల్ లో చేసిన సానుభూతి ప్రకటన ప్రకారం పోటీ నుంచి వైదొలగి ఉండాలి. కానీ విశాఖలో జనసేన అభ్యర్ధులు పోటీ చేయడం అంటే వారు పవన్ మాటను వినకుండా చేశారా లేక బద్వేల్ లో ఒక నీతి, విశాఖలో మరో రీతిగా ఉందా అన్న చర్చ అయితే ఉంది.
మొత్తానికి ఉప్పూ నిప్పులా ఉన్న వైసీపీ టీడీపీ చేరో చోటా పోటీ నుంచి తొలగితే జనసేన ఇద్దరికీ తానే పోటీ అనడం విశేషమే.