జనసేనాని పవన్‌కల్యాణ్ ఎట్టకేలకు వైఎస్ జగన్‌ను సీఎంగా గుర్తించారు. అప్రజాస్వామిక పాలన సాగిస్తున్న జగన్‌ను తాను సీఎంగా గుర్తించనని, ఆయన్ను జగన్రెడ్డిగానే చూస్తానని పదేపదే పవన్ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. పవన్ కామెంట్స్‌పై వైసీపీ కూడా తీవ్రస్థాయిలో స్పందించింది. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పవన్…సీఎంగా జగన్‌ను గుర్తించినా, గుర్తించకపోయినా నష్టమేమీ లేదని వైసీపీ నేతలు ఘాటుగా సమాధానమిచ్చారు.
తాజాగా కర్నూలులో సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు పవన్‌కల్యాణ్ తెలిపారు. ‘ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి’ తీసుకున్న ఈ నిర్ణయం ఆ కుటుంబానికి ఊరట కలిగిస్తుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. పవన్ ప్రకటనలో ముఖ్యమంత్రి, జగన్మోహన్రెడ్డి అని పేర్కొనడాన్ని గుర్తించాలి. పవన్ వైఖరిలో మార్పునకు ఈ ప్రకటనే నిదర్శనం.
జగన్ పాలనపై పవన్ అభిప్రాయంలో కూడా మార్పు వచ్చిందా? లేక తాను ఇటీవల బాధితురాలికి న్యాయం చేయాలనే డిమాండ్‌పై కర్నూల్లో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో….సీఎం సానుకూల నిర్ణయం తీసుకున్నారనే కారణంతో మర్యాదపూర్వకంగా అభినందించారా అనే విషయం తెలియాల్సి ఉంది. అలాగే సీబీఐ విచారణ ద్వారా త్వరగా న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు.