పాతికేళ్ల ప్రస్థానం అంటూ పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్, నిజంగా పాతికేళ్ల తర్వాతైనా కనీసం ఎమ్మెల్యేగా గెలుస్తారా అనేది అనుమానంగానే ఉంది. పవన్ కల్యాణ్ కి ఉన్న ఇమేజ్ కి, ఆయన వచ్చిన ఫోర్స్ కి, పవన్ వచ్చిన టైమ్ లో ఉన్న పొలిటికల్ గ్యాప్ కి.. చాలా సాధించి ఉండాల్సింది. కానీ రావడం రావడం.. బీజేపీ, టీడీపీ చేతిలో చిక్కి విలవిల్లాడిన పవన్, సొంతగా ఎదగడం అనే అంశాన్ని పూర్తిగా గాలికొదిలేశారు.
ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు, సీజనల్ పొలిటీషియన్ అని ఈపాటికే చాలాసార్లు రుజువైంది. ఓ పక్క ప్రజలకు సందేశాలిస్తూ, మరోపక్క అన్నయ్య సినిమాలు చేయమన్నాడని చెప్పి పాలిటిక్స్ వదిలేసి కాల్షీట్లిచ్చిన పవన్ కల్యాణ్ ని ఎవరూ సీరియస్ పొలిటీషియన్ అనుకోరు, అనుకోవాల్సిన అవసరం కూడా లేదు.
ఎన్నాళ్లీ టైమ్ పాస్ ఉద్యమాలు..
ఏదైనా సమస్య తీసుకుంటే దాని అంతు చూడాలి, దాన్ని అంతం చేసే వరకు పోరాడాలి, తాడో పేడో తేల్చుకోవాలి. ఆ క్రమంలో చేతులు కాలినా పర్లేదు, ఆ అనుభవం మరో విషయంలో ఉపయోగపడుతుంది. కానీ పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారు. ఒక అంశాన్ని ఇలా టచ్ చేసి, అంతలోనే మరో అంశానికి జంప్ అయిపోతున్నారు. సమస్య పరిష్కారం అయ్యేదాకా దానిపై నిలబడే ఓపిక, తీరిక పవన్ కి లేకుండా పోయింది.
పాచిపోయిన లడ్డూలంటూ ప్రత్యేక ప్యాకేజీని తూలనాడి, హోదా కోసం బలంగా గళమెత్తి తర్వాత నోరు మూసుకున్నారు. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం అనే పెద్ద సబ్జెక్ట్ ని తలకెత్తుకుని, ఆ తర్వాత ఉద్ధానం నీళ్ల సమస్య అంటూ మరో ప్రాంతీయ సమస్యకు మారిపోయి.. అసలు ఎటూ కాకుండా పోయారు.
రాయలసీమ నీటి పోరాటం, అమరావతి ఉనికి పోరాటం, గిట్టుబాటు ధరల కోసం రైతుల తరపున పోరాటం.. ఇలా పవన్ కల్యాణ్ చేపట్టని అంశమంటూ ఏదీ లేదు. అలా తీసుకున్న తర్వాత అది పరిష్కారమయ్యే వరకు ఎక్కడా నిలబడలేదు కూడా. విశాఖ ఉక్కు, జాబ్ క్యాలెండర్, విశాఖ ఆస్తి పన్ను పెంపు.. ఇలా అన్ని అంశాలను టచ్ చేసి వదిలిన పవన్ కు ఇప్పుడు కొత్తగా హ్యాండిల్ చేయడానికి మరో సబ్జెక్ట్ లేదు. ప్రతి అంశాన్ని ఇలా ముట్టుకొని అలా వదిలేస్తే, ప్రతిసారి కొత్త సబ్జెక్టులు ఎలా వస్తాయి.?
ఒకవేళ మరో సమస్య దొరికినా, అక్కడ కండిషన్స్ అప్లయ్. తన సినిమాలు తాను చేసుకుంటూ ఏదో అలా దాని పరిష్కారం కోసం వెదుకుతున్నట్టు కనిపించాలి. జనసైనికులు జనంలోకి రావాలి, తాను మాత్రం షూటింగ్ స్పాట్ నుంచి డైలాగులు కొట్టాలి. ఇదీ పవన్ రాజకీయ తీరు.
ఇంకా మారకపోతే ఎలా..?
తాను రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారు. తన పేరు పెట్టుకుని రాపోలులో జనసేన తరపున ఓ ఎమ్మెల్యే గెలిచారు. అయినా కూడా పవన్ కి జనం ఓట్లు ఎందుకు వేస్తారో, ఎవరికి వేస్తారో అనే విషయం అర్థం కాలేదు. ఉన్న ఒక్క ఎమ్మెల్యేను పొగబెట్టి బయటకు పంపించి, తనకంటే ఎత్తులో ఎవరూ లేకుండా చూసుకున్నారు.
తాజాగా జాబ్ క్యాలెండర్ అనే అశంపై పవన్ గట్టిగా నిలబడతారని నిరుద్యోగులు ఆశపడ్డారు. కానీ చివరికి ఎంప్లాయిమెంట్ ఎక్స్ చేంజిల్లో వినతిపత్రాలు ఇచ్చి సరిపెట్టారు, తాను బయటకు రాలేదు, జనసైనికుల్ని రోడ్లపైకి వదిలారు. కనీసం పవన్ రాష్ట్ర ప్రజల్ని ఉద్ధరించకపోయినా పర్లేదు, తనని నమ్ముకున్న జనసైనికులకు నమ్మకం కలిగేలా ఆయన ఏదైనా చేస్తే మంచిది.
ఏదో ఒక సమస్య అయినా పరిష్కారమయ్యే వరకు భుజాన ఎత్తుకుంటే పవన్ పై నమ్మకం ఏర్పడుతుంది. లేదంటే జనసైనికులు కూడా సీజనల్ కార్యకర్తలుగా మారే ప్రమాదం ఉంది.