తను ట్రెండ్ ను ఫాలో కాను అని, ట్రెండ్ ను సృష్టిస్తానంటూ అదేదో సినిమాలో చెప్పిన పవన్ కల్యాణ్.. రాజకీయాల్లో కూడా ట్రెండ్ సృష్టిస్తూ ఉన్నారు! ఎన్నికల్లో పోటీ చేయని పార్టీని కలిగి ఉండటం ఆయన ఇప్పటికే సృష్టించిన ట్రెండ్ లో ఒకటి. తన పార్టీ బలం గురించి పవన్ కల్యాణ్ ఎంతో చెబుతూ ఉంటారు.
అయితే ఆవిర్భవించి ఆరేడేళ్లు అయినా ఇప్పటి వరకూ జనసేన పోటీ చేసింది ఒక్కటంటే ఒక్క ఎన్నికలోనే. రేపు తిరుపతి బై పోల్ లో కూడా జనసేన పోటీ చేస్తుందో లేదో ఇంకా తెలియని పరిస్థితి. తన పార్టీ తరఫున అభ్యర్థిని పోటీలో ఉంచడానికి బీజేపీ అనుమతించాల్సిన పరిస్థితుల్లో సాగుతూ ఉంది పవన్ కల్యాణ్ రాజకీయం.
ఆ సంగతలా ఉంటే.. పవన్ కల్యాణ్ రైతుల కోసం ఒక దీక్ష చేశారు! ఆ దీక్ష ఇంట్లో కూర్చుని చేసింది కావడమే అసలు విశేషం. ఇంట్లో రైతు గెటప్ వేసి, ఒక చోట కూర్చుని ఫొటోకు పోజులిచ్చి దీక్ష ప్రారంభించినట్టుగా ప్రకటించేశారు. ఆ దీక్ష పవన్ ఇంట్లోనే మొదలై, ఇంట్లోనే ముగిసింది. ఫామ్ హౌస్ లో పవన్ ఆ దీక్ష చేసినట్టుగా ఉన్నారు!
అవతల రైతుల కోసం దీక్షలు ఎలా ఉంటాయో ఢిల్లీ వైపు చూస్తే అర్థం అవుతుంది. ఢిల్లీలో ఈ సమయంలో మామూలు చలి ఉండదు. అలాంటి చలిని, కాలుష్యాన్ని తట్టుకుంటూ.. రైతులు అక్కడ రోజుల తరబడి దీక్ష చేస్తూ ఉన్నారు. ఒకవైపు కరోనా భయాలు కూడా అక్కడ నుంచి రైతులను కదిలించలేకపోతున్నాయి.
తమ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గే వరకూ తగ్గేది లేదని రైతులు స్పష్టం చేస్తూ ఉన్నారు. వారిని శాంతింపజేయడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే తాము తెచ్చిన బిల్లుల మీద కానీ, రైతుల కోరిన డిమాండ్ల విషయంలో కానీ తగ్గేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. దీంతో రైతుల పోరాటం కొనసాగుతూ ఉంది.
మరి వణికించే చలికి తట్టుకుంటూ, రేయనక పగలనకా.. కూర్చున్న రైతులు చేస్తున్నదీ దీక్షే అని, ఇంట్లో కూర్చుని ఫొటోలకు పోజులిచ్చిన పవన్ కల్యాణ్ కూడా తనదీ దీక్షే అని చెప్పుకుంటూ ఉండటాన్ని ఏమనాలో! రైతుల కోసం మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖర్చుపెట్టాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు పవన్ కల్యాణ్.
మరి ఇవే సలహాలు మోడీకి కూడా ఇవ్వకూడదా? మోడీ తెచ్చిన వ్యవసాయ చట్టాలు దేశ వ్యాప్తంగా రైతులకు మంచి చేసేవి కావని రైతు సంఘాల వాళ్లు చెబుతున్నారు కదా, అలాంటప్పుడు దానిపై పవన్ ఎందుకు స్పందించడం లేదో! ఢిల్లీలో దీక్ష చేస్తున్న రైతులకు మద్దతుగా కూడా ఈ కొత్త రకం దీక్షలు అయినా చేయకూడదా?