రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడిని ఖండించే విషయంలో పవన్ కల్యాణ్ తెలివిగా తప్పించుకున్నారు. వైసీపీపై పరోక్షంగా విమర్శలు చేసి ఊరుకున్నారు. అదే సమయంలో బీజేపీ మాత్రం నేరుగా వైసీపీ గూండాలంటూ స్టేట్మెంట్లు ఇచ్చింది.
బద్వేల్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన స్వార్థం కూడా చూసుకుంది. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడిని ఖండిస్తూ.. పనిలో పనిగా తన మైలేజీ పెంచుకునే ప్రయత్నం చేసింది. అటు సీపీఐ కూడా టీడీపీ కంటే ఎక్కువగా బాధపడింది. వైసీపీని నేరుగా టార్గెట్ చేసింది.
బంద్ విషయంలో కూడా తెలివిగా తప్పించుకున్నారు పవన్ కల్యాణ్. పవన్ స్టేట్మెంట్ ఇచ్చే సమయానికి టీడీపీ బంద్ కి పిలుపునిచ్చింది. అయితే బంద్ విషయంలో పవన్ కల్యాణ్ ఎక్కడా జోక్యం చేసుకోలేదు. కనీసం మద్దతు ఇస్తున్నట్టు కూడా ప్రకటించలేదు. దాడి తర్వాత త్వరగా బయటికొచ్చి మాట్లాడిన పవన్ కల్యాణ్, వైసీపీని నేరుగా విమర్శించలేదు అదే సమయంలో టీడీపీని పూర్తిగా సమర్థించనూ లేదు.
టీడీపీ పాపం నాకెందుకు..?
వాస్తవానికి దాడికి గల కారణాలు ఏంటో అందరికీ తెలుసు. టీడీపీ నేతలు నోరు జారడం వల్లే ఈ పరిణామాలన్నీ జరిగాయి. ముఖ్యమంత్రిని నేరుగా తిడుతూ అంత దిగజారి మాట్లాడినా కూడా ఎవరూ టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండించలేదు, ఆ తర్వాత జరిగిన పరిణామాలనే హైలెట్ చేశారు. కానీ పవన్ మాత్రం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే సరిపెట్టుకున్నారు. టీడీపీ వ్యాఖ్యల పాపాన్ని తన నెత్తిపై వేసుకోవాలనుకోలేదు.
నిజానికి ఈరోజు చేపట్టిన బంద్ కు జనసేన కూడా కలిసొస్తుందని టీడీపీ భావించింది. పవన్ నుంచి ఆ మేరకు ప్రకటన వస్తుందని భావించింది. టీడీపీ కార్యకర్తలకు, జనసైనికులు కూడా తోడైతే మరింత రచ్చ చేయొచ్చని కలలుకనింది. కానీ పవన్ మాత్రం ఎక్కడా బంద్ ప్రస్తావన తీసుకురాలేదు.
ఇటీవల స్థానిక ఎన్నికల సమయంలో టీడీపీతో జనసేన కలసిపోయిందనే వార్తలొచ్చాయి. ఆ పార్టీ బీజేపీని వదిలి టీడీపీ పంచన చేరుతుందని అన్నారంతా. ఇప్పుడు పవన్ నేరుగా టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడిని ఖండించే క్రమంలో బంద్ లో కూడా పాల్గొంటామంటూ మరో అడుగు ముందుకు వేసి ఉంటే.. ఆ ప్యాచప్ నిజమేనని ఒప్పుకున్నట్టు అయ్యేది. కానీ పవన్ అంత దూరం వెళ్లలేదు. తెలివిగా వ్యవహరించారు.
అదే సమయంలో ఇటీవల వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కౌంటర్లు కూడా అదే స్థాయిలో పడ్డాయి. దీంతో పవన్ ఈ తలనొప్పులన్నీ ఎందుకనుకుంటూ బ్యాలెన్స్ డ్ గా ప్రవర్తించారు. బంద్ కు దూరమై టీడీపీ నేతల్ని బాగా నిరాశపరిచారు.