అంత భయం ఎందుకు పవనూ..?

జనసేన విస్తృత స్థాయి సమావేశాన్ని అందరూ టీవీల్లో, సోషల్ మీడియాలో లైవ్ లో వీక్షించారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ మాట్లాడినంతసేపు కార్యక్రమాన్ని నేరుగా లైవ్ ఇచ్చారు.  Advertisement పవన్…

జనసేన విస్తృత స్థాయి సమావేశాన్ని అందరూ టీవీల్లో, సోషల్ మీడియాలో లైవ్ లో వీక్షించారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ మాట్లాడినంతసేపు కార్యక్రమాన్ని నేరుగా లైవ్ ఇచ్చారు. 

పవన్ మాట్లాడే సమయానికి లైవ్ కట్ అయిపోయింది. ఆ తర్వాత దాదాపు రెండుగంటల విరామం అనంతరం పవన్ ప్రసంగాన్ని లైవ్ ఇచ్చారు. అది కూడా ఎడిటింగ్ చేసి. మరి ఈ మధ్యలో ఏం జరిగింది. అసలు పవన్ మాట్లాడిందంతా ఆ తర్వాత బయటకు వినిపించారా..? పోసాని ఎపిసోడ్ ఏమైనా కట్ చేశారా..?

మైక్ కనిపిస్తే చాలు ఇష్టం వచ్చిట్టుగా మాట్లాడ్డం పవన్ కి అలవాటుగా మారింది. ఓ సినిమా ఈవెంట్ లో అదే జరిగింది. పవన్ ఏం మాట్లాడుతున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడేశారు. చివరకు విమర్శలపాలయ్యారు. అదే నిన్న జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ ప్రసంగం పూర్తిగా రాజకీయాలను బేస్ చేసుకుని సాగింది.

కులాల కుంపట్లను రగిలిస్తూ, ఓ వర్గాన్ని పూర్తిగా రెచ్చగొడుతూ, వైసీపీని విమర్శిస్తూ.. 2024లో అధికారం మాదేనంటూ ఫైనల్ స్టేట్ మెంట్ ఇచ్చారు పవన్. మధ్య మధ్యలో సన్నాసులనే పదం బాగానే వాడినా.. అంతకు మించి హద్దుమీరలేదు. ప్రసంగం మొదట్లో గ్రామసింహాలంటూ.. కాస్త ఉపోద్ఘాతం కూడా ఇచ్చారు. అయితే పవన్ ఇలా పాయింట్ టు పాయింట్ మాట్లాడటానికి కారణం ఎడిటింగ్ మహత్యమే. అందుకే ఆయన ప్రసంగాన్ని నేరుగా లైవ్ లోకి ఇవ్వలేదు జనసేన టీమ్.

లైవ్ కాదు కాబట్టే.. పవన్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రతి పాయింట్ కి మధ్యలో గ్యాప్ తీసుకుంటూ, పక్కనవారి సలహాలు తీసుకుంటూ మాట్లాడారట. చివరకు దాన్ని ఎడిటింగ్ చేసి, జనసేన యూట్యూబ్ లో లైవ్ అని పెట్టేశారు. మధ్యలో పవన్ పోసాని ప్రస్తావన కూడా చేశారని, అయితే దాన్ని ఎడిటింగ్ చేశారని సభలో పాల్గొన్నవారంటున్నారు.

పవన్ మాట్లాడేటప్పుడు జనసైనికుల గొడవ కామన్.. ఆ గొడవ కూడా ఇందులో లేదట. వారిని పవన్ వారిస్తున్న సందర్భాన్ని కూడా జాగ్రత్తగా ఎడిట్ చేశారు. అందుకే పవన్ మాట్లాడేటప్పుడు ఎక్కడా ఎవర్నీ వీడియోలు తీయనీయలేదు. ఓ దశలో స్వయంగా పవన్, సెల్ ఫోన్ లో వీడియోలు తీయొద్దని కార్యకర్తలకు చెప్పిన మాట మాత్రం ప్రసారం అయింది. కేవలం పార్టీ వాళ్లు తీసిన వీడియోని ఎడిట్ చేసి, రఫ్ కట్ పవన్ చూసిన తర్వాతే దాన్ని బయటకు వదిలారు.

దమ్ముంటే రండి, మీ ప్రతాపమో మా ప్రతాపమో చూసుకుంటామంటూ సవాళ్లు విసిరే పవన్ కల్యాణ్ కి కనీసం మైక్ ముందు నేరుగా మాట్లాడే ధైర్యం లేదంటేనే విచిత్రంగా తోస్తుంది. మాట్లాడిందంతా బయటకొస్తే ఏమవుతుందోనన్న భయం పవన్ లో ఉన్నట్టుంది. అందుకే ఈ ఎడిటింగ్ కష్టాలు.