పవన్‌ బాబా ఉవాచ: నన్ను మాత్రమే నమ్మండి.!

'రాజకీయాల్లో వెన్నుపోట్లు మామూలే.. కొన్ని సార్లు నమ్ముకున్న నేతలే నట్టేట్లో ముంచేస్తుంటారు.. జనసేన ఓడితే, పార్టీని వీడేవారుంటారని నాకూ తెలుసు. కానీ, కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. నేతల్ని చూసి కాదు, నన్ను చూసి…

'రాజకీయాల్లో వెన్నుపోట్లు మామూలే.. కొన్ని సార్లు నమ్ముకున్న నేతలే నట్టేట్లో ముంచేస్తుంటారు.. జనసేన ఓడితే, పార్టీని వీడేవారుంటారని నాకూ తెలుసు. కానీ, కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. నేతల్ని చూసి కాదు, నన్ను చూసి ఓటెయ్యండి. మీరు వేసే ప్రతి ఓటూ నాకు వేస్తున్నట్లు భావించండి..' అంటూ పవన్‌ బాబా, జనసైనికులకు ఉద్బోధ చేశారు.

పవన్ భలేగా చెప్పారని కొందరు జనసైనికులు మురిసిపోవచ్చుగాక. కానీ, జనంలోకి కార్యకర్తలు వెళ్ళేంది నాయకుల వెంటనే. ఆ నాయకుల్నే నమ్మొద్దని అధినేత చెబితే, కార్యకర్తల పరిస్థితి ఏంటి.? గ్రామ గ్రామాలకీ కార్యకర్తల్ని వెంటేసుకుని పవన్ వెళ్ళగలరా.? అవకాశమే లేదు. పవన్ నోట ఇలాంటి మాటలు ఎలా వస్తాయో ఏమోనంటూ రాజకీయ పండితులు ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది.

ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న పవన్‌ కళ్యాణ్‌, అభిమానుల్ని ఉర్రూతలూగించేలా మాట్లాడారు. అచ్చంగా సినిమాటిక్‌ ప్రసంగం అన్పించిందే తప్ప, ఎక్కడా పవన్‌ తన ప్రసంగాల్లో ప్రజలకు నాయకుడిలా భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మంత్రుల్ని విమర్శించడం, అధికార పార్టీ నేతలపై మండిపడ్డం విపక్షంలో వున్నవారికి సహజమే కావొచ్చు. కానీ, ఇక్కడా పవన్‌ 'బౌండరీ లైన్‌' దాటేస్తున్నారు. అఫ్‌కోర్స్‌, పవన్‌ కళ్యాణ్‌ తన తిక్కకు లెక్క లేదని సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ నిరూపించేసుకున్నారనుకోండి.. అది వేరే విషయం.

పోటీ చేసిన రెండు చోట్లా పార్టీ అధినేత ఓడిపోవడం చిన్న విషయమేమీ కాదు. ఓడిపోయినా, నా వెంట ఇంతమంది నడిచి రావడం చాలా ఆనందంగా వుందంటూ పవన్‌ కళ్యాణ్‌ ఉప్పొంగిపోతున్నారు. అది పవన్‌ కళ్యాణ్‌కి వున్న సినీ గ్లామర్‌ కారణంగా జరిగింది తప్ప, ఆయన నాయకత్వ లక్షణాల మీద నమ్మకంతో వచ్చిన జనం వాళ్ళు కాదని చాలామందికి అర్థమయినా, పవన్‌ కళ్యాణ్‌కి మాత్రం వాస్తవం అర్థం కావడంలేదు.

ఇసుక సమస్యపై పవన్‌ పోరాటాన్ని తప్పు పట్టలేం. ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయమే చేస్తుంది, పవన్‌ కూడా అదే చేస్తున్నారనుకోవచ్చు. కానీ, ఈ క్రమంలో టీడీపీని కలుపుకుపోవడమేంటి.? లాంగ్‌ మార్చ్‌కి ముందు రోజు వరకూ చంద్రబాబునీ, వైఎస్‌ జగన్‌నీ ఒకే ఫ్రేమ్‌లో పెట్టి, 'దొందూ దొందే' అని విమర్శించింది జనసేన. ఇంతలోనే సీన్‌ మారిపోయింది.

విశాఖలోనే పోరాట స్ఫూర్తిని నేర్చుకున్నానంటూ ఇంకో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు పవన్‌ ఈ రోజు. నిజమే, ఆయనకి విశాఖతో అనుబంధం వుంది. కానీ, ఆ విశాఖ ప్రజలే పవన్‌ కళ్యాణ్‌ని ఓడించారు. ఓటమి ఏ నాయకుడ్ని అయినా ఆలోచనలో పడేయాలి. ఆ ఆలోచనల్లోంచి గెలుపు దిశగా అడుగులేయడానికి మెరుగైన ఆలోచనలు చేసుకోవాలి.

ఇంకో నాలుగున్నరేళ్ళుంది మళ్ళీ ఎన్నికలు రావడానికి. ఈలోగా, అభిమానుల్ని అలరించే 'ఈవెంట్స్‌'తో పవన్‌ కాలక్షేపం చేయాలనుకుంటే అది ఆయనిష్టం. కానీ, ఇంకోసారి ఓడితే.. సినిమాల్లో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు కూడా కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం.