పయ్యావుల కేశవ్‌ని ‘కట్టి’ పడేసినట్లేనా.!

టీడీపీ సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌ పార్టీ మారబోతున్నారంటూ చాలకాలంగా గాసిప్స్‌ విన్పిస్తున్న విషయం విదితమే. నిజానికి, ఎన్నికలకు ముందే పయ్యావుల పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ సంగతి…

టీడీపీ సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌ పార్టీ మారబోతున్నారంటూ చాలకాలంగా గాసిప్స్‌ విన్పిస్తున్న విషయం విదితమే. నిజానికి, ఎన్నికలకు ముందే పయ్యావుల పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ సంగతి పక్కన పెడితే, ఉరవకొండ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తోన్న పయ్యావుల కేశవ్‌కి పీఏసీ ఛైర్మన్‌గా అవకాశమిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవి ప్రతిపక్షానికే దక్కుతుంటుంది. గతంలో అప్పటి ప్రతిపక్షం అయిన వైఎస్సార్సీపీ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌ అవకాశం దక్కించుకున్నారు.. ఆయనిప్పుడు ఆర్థిక మంత్రి. 

పయ్యావుల కేశవ్‌ ఇటీవల అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ బీజేపీ నేతలతో చెట్టాపట్టాలేసుకు తిరిగారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ పయ్యావుల కేశవ్‌, బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. నిజానికి ఆ ప్రచారం ఎక్కువగా చేసింది కూడా టీడీపీ అను'కుల' మీడియానే కావడం గమనార్హం. అయితే, పయ్యావుల మాత్రం పార్టీ మారే విషయమై ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఇక, ఇప్పుడు పయ్యావులను పీఏసీ ఛైర్మన్‌గా చంద్రబాబు ప్రతిపాదించడంతో.. ఆయన పార్టీ మారతారన్న ఊహాగానాలకు దాదాపుగా చెక్‌ పడ్డట్లేనన్నది టీడీపీ వర్గాలు చెబుతున్న మాట. 

23 మంది ఎమ్మెల్యేలున్న తెలుగుదేశం పార్టీని చంద్రబాబు రానున్న ఐదేళ్ళు సమర్థవంతంగా నడిపించగలరా.? అన్న ప్రశ్నకు మాత్రం టీడీపీ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. మొత్తంగా 16 మంది ఎమ్మెల్యేలను లాగేయడానికి బీజేపీ స్కెచ్‌ రెడీ చేసిందనీ, ఆషాఢం పూర్తయ్యాక.. శ్రావణ మాసంలో మంచి ముహూర్తం కూడా వుందనీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూనే వుంది. 

ఏదిఏమైనా, పయ్యావుల కేశవ్‌ని కేసీఆర్‌ ఏజెంట్‌గా గతంలో అభివర్ణించిన కొందరు తెలుగు తమ్ముళ్ళు, ఇప్పుడాయనకు చంద్రబాబే స్వయంగా పీఏసీ ఛైర్మన్‌గా అవకాశమివ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారన్నది నిర్వివాదాంశం. ఆ పదవి ఇవ్వడం ద్వారా కేశవ్‌ని పార్టీ మారకుండా చేయగలిగానని చంద్రబాబు అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. పదవులతో నేతల్ని కట్టి పేయడం.. అనేది చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్యే అయినా.. ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నం.