లాక్ డౌన్ తో మొదటి నుంచి బావురుమంటున్నది పెట్రో ఉత్పత్తుల సంస్థలే. ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉండిన వ్యాపారం, కంపెనీలు-ప్రభుత్వాలు బాగా డబ్బులు సంపాదించుకునేందుకు ఉండిన అవకాశం పెట్రోల్ వ్యాపారం. ఎప్పుడైతే లాక్ డౌన్ తో ప్రజలు ఎక్కడిక్కడ ఆగిపోయారో.. అప్పటి నుంచి పెట్రో ఉత్పత్తిదారులకు, ప్రభుత్వాలకు ఆదాయం గణనీయంగా పడిపోయింది. అప్పటికే చమురు సంస్థలు రేట్ల పతనంతో కొట్టుమిట్టాడుతూ ఉండేవి. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రారంభం అవుతున్న దశలోనే లీటర్ క్రూడ్ ఆయిల్ ధర 12 రూపాయలకు పడిపోయింది!
లీటర్ మంచి నీళ్లు ధర 20 రూపాయలు అనుకుంటే, క్రూడ్ ధర మాత్రం 12 రూపాయలకు పడిపోయింది. అయితే ఆ మేరకు ఇండియాలో ధరలు తగ్గలేదు అనుకోండి! అంతర్జాతీయంగా ధరలు పడిపోయిన సందర్భంలో వీలైనంతగా దండుకోవడానికే మోడీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. సర్ చార్జీలను మరింతగా పెంచి లాభాలను పెంచుకుంది మోడీ సర్కారు. అయితే ఇంతలోనే లాక్ డౌన్ వచ్చి పడింది.
ప్రస్తుతం దేశంలో పెట్రోల్ డిమాండ్ 70 శాతం పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. రోజువారీ వినియోగంలో గత నెలలో మొత్తంగా 50 శాతం తక్కువ పెట్రోల్ అమ్ముడయ్యిందని, ఈ నెలలో ఆ లోటు 70 శాతం వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. ప్రపంచంలో పెట్రోల్ ను కొనే దేశాల్లో, పెట్రోల్ ను వినియోగించే దేశాల్లో ఇండియా మూడో స్థానంలో ఉంది. అమెరికా, చైనాల తర్వాత పెట్రోల్ ను ఎక్కువగా వాడే, కొనుగోలు చేసే దేశాల్లో ఇండియా ఉంది. ఈ దేశంలో 70 శాతం డిమాండ్ పడిపోవడంతో.. పెట్రో ఉత్పత్తిదారులు బావురుమనే పరిస్థితి.
ఇక అమెరికా, చైనాల్లో కూడా పెట్రోల్ డిమాండ్ బాగా పడిపోయింది. అంతర్జాతీయంగా కూడా లాక్ డౌన్ నేపథ్యంలో డిమాండ్ మరింత పతనం అయ్యింది. ఈ క్రమంలో ముడి చమురు ధర పతనం అయిపోయింది. అందుకే ఒపెక్ దేశాలు, చమురు ఉత్పత్తి దేశాలు ఒక నిర్ణయం తీసుకుంటున్నాయట. రాబోయే రెండు నెలలూ చమురు తవ్వకాలను ఆపేయాలని! తద్వారా అంతర్జాతీయంగా పెట్రోల్ ధర మళ్లీ పెరిగేలా చూసుకోవాలని అవి భావిస్తున్నట్టుగా సమాచారం.