హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ హత్యాచార నిందితుడి ఆత్మహత్యపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇటీవల ఆరేళ్ల చిన్నారిపై పల్లకొండ రాజు హత్యాచారానికి పాల్పడడం తీవ్ర సంచలనం రేకెత్తించింది.
తెలుగు సమాజాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని ఊరూ, వాడా నినదించింది. ఈ నేపథ్యంలో నిందితుడి కోసం వేలాది మంది పోలీసులు జల్లెడ పడుతుండగా, నిన్న ఉదయం రాజు ఆత్మహత్య వార్త సంచలనం కలిగించింది.
తమ కుమారుడిని పోలీసులే చంపారని మృతుడి తల్లి ఆరోపిస్తున్నారు. మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెజార్టీ సమాజం ఇదే శిక్ష కోరుతున్న సంగతి తెలిసిందే.
అయితే రాజుది కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందని, నిజానిజాలను తేల్చాలని హైకోర్టులో పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ ఇవాళ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు స్పందన ఎలా ఉంటుందోననే ఉత్కంఠ నెలకుంది.