నాకు శిక్ష వేయండి ఫ్లీజ్‌…

ఎన్నిక‌ల సంఘానికి కాదు, త‌న‌కు శిక్ష వేయాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ రాజీవ్‌కుమార్ మ‌ద్రాస్ హైకోర్టును కోరారు. క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతంగా ఉన్న స‌మ‌యంలో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు నిర్వ‌హించడంపై దేశ వ్యాప్తంగా పెద్ద…

ఎన్నిక‌ల సంఘానికి కాదు, త‌న‌కు శిక్ష వేయాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ రాజీవ్‌కుమార్ మ‌ద్రాస్ హైకోర్టును కోరారు. క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతంగా ఉన్న స‌మ‌యంలో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు నిర్వ‌హించడంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. అలాగే మ‌ద్రాస్ హైకోర్టు ఏకంగా ఎన్నిక‌ల సంఘంపై మ‌ర్డ‌ర్ కేసు పెట్టాల‌ని ఆదేశించిన నేప‌థ్యంలో ఆయ‌న స్పందించారు.

నిజానికి కొన్ని ద‌శ‌ల ఎన్నిక‌ల‌ను వాయిదా వేద్దామ‌ని అనుకున్నామ‌న్నారు. కానీ రాష్ట్ర‌ప‌తి పాల‌న పెడితే అది ఎన్నిక‌ల సంఘంపై విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అవుతుంద‌నే ఉద్దేశంతో వెన‌క్కి త‌గ్గామ‌న్నారు. 

ఒక పార్టీకి అనుకూలంగా, మ‌రో పార్టీకి వ్య‌తిరేకంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తాయన్నారు. అందుకే షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌లు నిర్వ‌హించిన‌ట్టు రాజీవ్ కుమార్ తెలిపారు.  

న్యాయ‌స్థానాల ఘాటు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో తాను రాజీనామా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే వ్య‌క్తిగ‌తంగా శిక్షించినా త‌న‌కు అంగీకార‌మే అన్నారు. ఎన్నిక‌ల సంఘంపై మ‌ద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్య‌లు త‌మ‌ను తీవ్రంగా తనిరుత్సాహ ప‌రిచాయ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ విష‌యంలో సంఘానికి శిక్ష వేయ‌కుండా, వ్య‌క్తుల‌కు వేయాల‌ని ఆయ‌న కోర్టును అభ్య‌ర్థించ‌డం గ‌మ‌నార్హం. మ‌ద్రాస్ హైకోర్టు త‌న ఘాటు వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని, త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా బాధ్యున్ని చేయాల‌ని రాజీవ్ కుమార్ కోర‌డం విశేషం. ఎన్నిక‌ల సంఘంపై ప‌డిన మ‌చ్చ‌ను తొల‌గించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.