ఇలాంటిదేదో జరుగుతుందనే తెలిసే…అయ్యా సీఎం గారూ కాస్తా మన ఎమ్మెల్యేలు, ఎంపీలకు దర్శన భాగ్యం కలిగించండయ్యా అని నెత్తీనోరూ కొట్టుకొని చెబితే విన్నాడా? అబ్బే లేనే లేదు కదా! చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అంతా అయిపోయాక…ఇప్పుడు సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు అపాయింట్‌మెంట్ ఇస్తే ఏం లాభం? అయిపోయింది బాబోయ్ వైసీపీ పని. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ఆ రఘురామకృష్ణంరాజు బాటే పట్టేలా ఉన్నారు. ఆ పార్క్ హయ్యత్ హోటల్‌లో బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అంతా సెట్ చేసేశాడు…ఇదీ ఆంధ్రజ్యోతిలో ‘స్టార్’ సీక్రెట్స్!’ శీర్షకతో ప్రచురితమైన కథనం సారాంశం.
ఆ పత్రికలో కథనం వచ్చిందంటే అది తప్పక నిజమే అయి ఉంటుంది. అనవసరంగా పార్క్ హయ్యత్ హోటల్‌ని గెలుక్కుని సరికొత్త సమస్య తెచ్చుకున్నట్టుగా అర్థమవుతోంది. అబ్బో ఏం రాశారూ బాసూ. బీజేపీ ఎంపీ సుజనాచౌదరి, ఆ పార్టీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ రహస్య సమావేశంపై సీసీ పుటేజీ ఎన్నెన్ని కొత్త విషయాలను వెలికి తీసిందయ్యా సామి.
పుణ్యానికి పోతే పాపం వెనుకంబడి వచ్చిందనే సామెత చందానా…ఆ నిమ్మగడ్డను విజువల్ సాక్షిగా బుక్ చేద్దామనుకుంటే, వైసీపీ అధికార పార్టే ఇరుక్కుందే. అందుకే చెడపకురా చెడదవని పెద్దలు చెబితే…ఈ వైసీపీ పెద్దలు విన్నారా? అబ్బే సలహాలు స్వీకరించే అలవాటు వైసీపీ డిక్షనరీలోనే లేదు కదా?
అందులోనూ ఆ సుజనాచౌదరితో పెట్టుకోవద్దయ్యా అని చెబితే విన్నారా? లేదే? తలనొప్పి, తత్వం తమ వరకూ వస్తే తప్ప బోధపడవంటారు. ఇప్పుడు వైసీపీకి అలాంటి అనుభవమే ఎదురైందని ఆంధ్రజ్యోతి కథనం సారాంశం. ఇంకా చాలా చాలా ఆసక్తికర, సంచలన విషయాలు ఈ కథనంలో ఉన్నాయి.
తమ పార్టీ ప్రజాప్రతినిధులంతా సుజనాచౌదరిని కలుస్తున్నారని జగన్ కేబినెట్‌కు బాగా తెలుసు. ఈ విషయం ఎంత నిజమంటే ఆంధ్రజ్యోతి అక్షరంపై ఒట్టు. ఈ వాక్యాలను చదవండి మీకే తెలుస్తుంది.
‘కొద్ది రోజుల క్రితం ఒక మంత్రిని విజయవాడలోని ఆయన నివాసంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కలిశారు. వారి మధ్య పిచ్చాపాటీ సంభాషణల్లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ‘మనవాళ్లు కొందరు సుజనాను కలిశారని అంటున్నారు. ఊరికే కలిశారా… ఏవైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అన్నది ఆరా తీస్తున్నారు. పార్టీలో కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఇటువంటి సమస్యలు వస్తున్నాయి’ అని ఆ మంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిసిందని చక్కగా రాసుకొచ్చారు.
సుజనాచౌదరిని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిశారని మంత్రి చెబితే నమ్మరని, దానికి బలం చేకూర్చేలా అటు వైపు నుంచి కూడా సాక్ష్యాలు కూడా ప్రవేశ పెట్టారు. సుజనా సన్నిహిత వర్గాల సమాచారాన్ని ఇచ్చారు. తమ నాయకుడిని వైసీపీ నేతలు కలిసిన మాట వాస్తవమే అని సుజనా సన్నిహిత వర్గాలు ద్రువీకరిస్తూ ఓ సర్టిఫికెట్ కూడా ఇచ్చాయట. ఆ సర్టిఫికెట్‌లో ఇలా రాసి ఉంది.
‘సుజనాను కలిసిన వైసీపీ నేతల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నమాట నిజం. ఆ పార్టీలో అంతర్గతంగా పరిస్థితి బాగోలేదు. వారి బాధలనో, అసంతృప్తినో వ్యక్తం చేయడానికి కలుస్తున్నారు. వారంతా బీజేపీలో చేరిపోతున్నారని అనలేం. ప్రస్తుతానికి వారి బాధలు చెప్పుకొంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం’ అని రాసుకొచ్చారు.
ఆంధ్రజ్యోతిలో ఈ కథనాన్ని చదివితే ఏమర్థమైంది? పదేళ్ల క్రితం వరకు ఏప్రిల్ మొదటి తారీఖున ఇలాంటి కథనాలు ప్రతి పత్రికలో వచ్చేవి. కథనం అంతా చదివాక చివర్లో నేడు ఏప్రిల్ ఫస్ట్ అని ట్విస్ట్ ఇచ్చేవి. అంత వరకూ ఎంతో ఉత్కంఠకు గురైన పాఠకుల మనసు తేలిక పడేది. సరదాగా నవ్వుకునే వారు.
కానీ ఆ తర్వాత కాలంలో పాఠకుల్లో చైతన్యం పెరిగిన నేపథ్యంలో తమను ‘ఫూల్’ చేయడం ఏంటనే నిలదీత మొదలైంది. దీంతో అప్పటి నుంచి ఏప్రిల్ ఫస్ట్ పాఠకులను పూల్ చేసే సంప్రదాయానికి పత్రికలు ఫుల్‌స్టాప్ పెట్టాయి.
మరీ ముఖ్యంగా గత ఐదారేళ్లుగా కథనం చివర్లో ఏప్రిల్ ఫస్ట్ అని ప్రకటించకుండా…ప్రతిరోజూ ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తు న్నాయి. దానికి నిలువెత్తు నిదర్శనమే ‘స్టార్ సీక్రెట్స్ ’ కథనం. ఈ కథనాన్ని నమ్మండి ఫ్లీజ్.
-సొదుం