పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎప్పటికప్పుడు అంచనాలు పెరిగిపోతూ వస్తుండడం చాలా అనుమానాలకు తావిచ్చింది. 50 వేల కోట్లకు పైగా వ్యయం అవుతుందనే తాజా అంచనాలతో చివరి సారిగా చంద్రబాబు సర్కార్ కేంద్రానికి నివేదికలు పంపిన విషయం విదితమే. జాతీయ ప్రాజెక్టు అయినా పోలవరం ప్రాజెక్ట్‌ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తోంది.. అదీ కేంద్రం సాయంతో. అయితే, చంద్రబాబు సర్కార్ పెంచిన అంచనాలపై బీజేపీ నేతలే అప్పట్లో పెదవి విరిచారు. చిత్రంగా, కేంద్రం.. ఆ అంచనాలకు ఆమోద ముద్ర వేసినట్లు పేర్కొంది.
కాగా, 'పోలవరం అంచనాల పెంపు విషయంలో ఎవరికి తోచినట్లు వారు మాట్లాడారు.. బీజేపీ కావొచ్చు, వైసీపీ కావొచ్చు.. మా మీద చేసిన ఆరోపణల్లో పస లేదని తేలిపోయింది..' అంటూ టీడీపీ నేతలు పండగ చేసుకుంటున్నారు. మరోపక్క, పెరిగిన అంచనాల్ని కేంద్రం ఆమోదించడమంటే.. అందుకు తగ్గట్టుగా వీలైనంత త్వరగా ప్రాజెక్టు పనుల నిమిత్తం నిధుల విడుదల జరగాల్సి వుంటుందని వైఎస్ జగన్ ప్రభుత్వం అంటోంది. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందన్న తమ ఆరోపణలకు కట్టుబడి వున్నామన్నది వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్న మాట.
అయితే, పెరిగిన అంచనాలకు తగ్గట్టుగా నిధుల్ని పోలవరం ప్రాజెక్టు కోసం వెచ్చించడానికి కేంద్రం ముందుకొస్తుందా.? అన్నది మాత్రం ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే. ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి మించి పునరావాసం కోసమే వెచ్చించాల్సి రావడం గమనార్హమిక్కడ. చాలా ప్రాజెక్టులకి ఈ పునరావసమే ప్రధాన సమస్య. ఇప్పటికిప్పుడు కేంద్రం ఇబ్బడిముబ్బడిగా నిధుల్ని విడుదల చేస్తే సరే సరి.. లేదంటే సమీప భవిష్యత్తులో అంచనాలు మరింతగా పెరిగిపోతాయ్.
కాగా, తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజా వేదికకీ పోలవరం ప్రాజెక్టుకీ లంకె పెడ్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రజా వేదికను కూల్చేయాలని వైఎస్ జగన్ ఆదేశిస్తే, పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. దాన్నీ కూల్చేస్తుందా.? అంటూ అడ్డగోలు వాదనకు తెరలేపారు మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు.
పోలవరం ప్రాజెక్టుకి అన్ని అనుమతులూ దాదాపుగా లభించినట్లే. ప్రజా వేదిక విషయంలో మాత్రం నిబంధనలకు నీళ్ళొదిలింది చంద్రబాబు సర్కార్. పైగా, సగానికి సగం నిధుల్ని అప్పటి అధికార పార్టీ పెద్దలు మింగేశారన్నది కదా.. ఇప్పుడు ప్రధాన ఆరోపణ. దానిపై సమాధానం చెప్పకుండా చంద్రబాబుపై కక్ష.. పోలవరం ప్రాజెక్టునీ కూల్చేస్తారా.? లాంటి పసలేని విమర్శలు చేయడమేంటో టీడీపీ నేతలకే తెలియాలి.