Advertisement

Advertisement


Home > Politics - Political News

బంధుత్వం కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం

బంధుత్వం కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం

రాజకీయాల్లో బంధుత్వాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. వాటికి ప్రాధాన్యం ఉంటుంది కూడా. అయితే ఆ బంధుత్వం కూడా రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడితేనే చెల్లుబాటు అవుతుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు వ్యూహాలు అనుసరిస్తున్నారు. మొదటిది సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇవ్వడం. రెండోది ఇచ్చిన మాటకు కట్టుబడటం. అంటే ఎప్పుడో ఒకప్పుడు అవకాశాన్ని బట్టి దాన్ని నెరవేర్చడం.

అయితే జగన్ కూడా రాజకీయ నాయకుడే కాబట్టి బంధుత్వాలకు అతీతుడేమీ కాదు. బంధువులకు ప్రాధాన్యం ఇచ్చి ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చిన, పదవులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే రాజకీయ ప్రయోజనాల ముందు బంధుత్వాలను అంతగా పట్టించుకోరు. సినీ పరిశ్రమకు సంబంధించి టిక్కెట్ల రేట్ల విషయంపై, ఇతర సమస్యలపై చర్చించడానికి మెగా స్టార్ చిరంజీవి నాయకత్వంలో కొందరు హీరోలు, సినిమా ప్రముఖులు జగన్ కలిసి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంలోనే ఒక వార్త వినబడింది. అదేమిటంటే ....కమెడియన్ ఆలీకి జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తున్నారని. మరో వారంలో కలుద్దాం..గుడ్ న్యూస్ చెబుతానంటూ జగన్ ఆలీకి చెప్పినట్లుగా మీడియాలో వచ్చింది. ప్రత్యేకంగా ఆలీని పిలిచి సీఎం జగన్ చెప్పటం ద్వారా..పదవి ఇవ్వబోతున్నారనేది క్లారిటీ వచ్చింది. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం నామినేటెడ్ పదవులు ఖాళీ లేవు. మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ లేదు.

అయితే ఈ ఏడాది జూలైలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో విజయ సాయిరెడ్డి, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి..టీజీ వేంకటేష్...బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు ఉన్నారు. వారిలో విజయ సాయిరెడ్డికి తిరిగి వైసీపీ నుంచి రెన్యువల్ అయ్యే అవకాశం ఉంది. ఇక, బీసీ కోటాలో యాదవ వర్గానికి ఇవ్వాలని నిర్ణయించనట్లుగా తెలుస్తోంది. ఇక, మూడో స్థానం మైనార్టీ వర్గానికి ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

ప్రస్తుతం దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా మైనార్టీకి రాజ్యసభ కేటాయించటం ద్వారా మైనార్టీ వర్గాల్లో పార్టీ మైలేజ్ పెరుగుతుందని జగన్ అంచనాగా తెలుస్తోంది. తాజాగా.. మండలికి డిప్యూటీ ఛైర్మన్ గా మైనార్టీ మహిళను నియమించారు. ఇక, ఇప్పుడు మైనార్టీ కోటాలో ఆలీని రాజ్యసభకు పంపటం ఖాయమనే ప్రచారం పార్టీలో మొదలైంది. దీని పైన రానున్న వారం పది రోజుల్లో అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన మోహన్ బాబు సైతం పార్టీ కోసం ప్రచారం చేసారు. పైగా ఆయన వైఎస్ కుటుంబానికి బంధువు కూడా. ఇక, ఇప్పుడు మోహన్ బాబును కాదని... ఆలీని ఏకంగా రాజ్యసభకు పంపటం ద్వారా జగన్ భారీ షాక్ ఇచ్చినట్లేననే చర్చ అప్పుడే టాలీవుడ్ లో మొదలైంది.

పార్టీ అధికారంలోకి వస్తే మోహన్ బాబుకు టీటీడీ ఛైర్మన్ లేదా రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం సాగింది. కాగా... మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని కలిసారు. ఆ సమయంలో బీజేపీలో చేరుతారా అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పలేనంటూ దాటేసారు. అప్పటి నుంచి మోహన్ బాబు - సీఎం మధ్య గ్యాప్ వచ్చినట్లుగా పార్టీలో ప్రచారం సాగుతోంది.

సినీ సమస్యల విషయంలోనూ ఎక్కడా మోహన్ బాబు ప్రమేయం లేదు. సీఎం స్వయంగా చిరంజీవిని ఆహ్వానించి..చర్చలు చేసారు. సమస్యల పరిష్కారం చిరంజీవి ద్వారానే జరిగిందనే ప్రచారానికి అవకాశం కల్పించారు. మోహన్ బాబు బంధువే అయినప్పటికీ ఆయనకు జగన్ ప్రాధాన్యం ఇవ్వడంలేదు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?