Advertisement

Advertisement


Home > Politics - Political News

ప‌రిటాల వ‌ర్సెస్ వ‌ర‌దాపురం.. టికెట్ ఎవ‌రికో!

ప‌రిటాల వ‌ర్సెస్ వ‌ర‌దాపురం.. టికెట్ ఎవ‌రికో!

2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ చిత్త‌యిన కొన్ని రోజుల వ్య‌వ‌ధిలోనే ఆ పార్టీకి త‌లాక్ చెప్పారు వ‌ర‌దాపురం సూరి. 2014 ఎన్నిక‌ల్లో ధ‌ర్మ‌వ‌రం నుంచి పోటీ చేసి నెగ్గారీయ‌న‌. పార్టీ నుంచి అధికారం చేజార‌గానే.. ఈయ‌న వెంట‌నే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండ‌ను చూసుకున్నారు. వ్య‌క్తిగ‌తంగా జాతీయ ర‌హ‌దారుల కాంట్రాక్ట‌ర్ వ‌ర‌దాపురం సూరి. 

అంగ‌, అర్ధ‌బ‌లానికి తోడు కాంట్రాక్టుల ద్వారా రాజ‌కీయ శ‌క్తిగా నిలిచాడు. త‌ను ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో ధ‌ర్మ‌వ‌రం ప‌రిస‌ర ప్రాంతాల్లో ఏ కాంట్రాక్టు ప‌నులు జ‌రిగినా వాటాలు తీసుకునేవాడ‌నే ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. మ‌రి ఇలా కాంట్రాక్ట్ వ్య‌వ‌హారాల గుట్లుమ‌ట్లు ఎరిగిన వ‌ర‌దాపురం సూర్య‌నారాయ‌ణ టీడీపీ అధికారం కోల్పోగానే, బీజేపీలో చేరారు.

మ‌రి ఈయ‌న చేరిక ధ‌ర్మ‌వ‌రంలో ఎక్క‌డా బీజేపీ ఉనికిని చూప‌లేక‌పోయింది. ఏదోలా అధికారం చాటున దాక్కొనే ప్ర‌య‌త్నంలో భాగంగా వ‌ర‌దాపురం లాంటి వాళ్లు బీజేపీలో చేరారు త‌ప్ప‌.. బీజేపీని ఉద్ధ‌రించాల‌నేది వీరి ఉద్ధేశం కాద‌నేది ప్ర‌జ‌లు అనుకునేమాట‌. రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాల‌తో బీజేపీలో చేరిన సీఎం ర‌మేష్, సుజ‌నా చౌద‌రి, టీజీ వెంక‌టేష్ లాంటి వారి వ‌లే వర‌దాపురం సూరి లాంటి వాళ్లు కూడా బీజేపీ పేరుతో హ‌డావుడి చేశారు. మ‌రి మ‌రో రెండేళ్ల‌లో ఏపీలో మ‌ళ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌లు రానున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో ఇలాంటి ఫిరాయింపుల బ్యాచ్ ఏం చేస్తుంద‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది.

వీరు బీజేపీని బ‌లోపేతం చేయ‌డం అనే ప‌నే పెట్టుకోలేదు. ప్ర‌స్తుతానికి బీజేపీని ఒక షెల్ట‌ర్ చేసుకున్నారు. టీజీ వెంక‌టేష్ లాంటి వాళ్లైతే త‌మ త‌న‌యుడిని టీడీపీలోనే పెట్టారు. ఇక చంద్ర‌బాబు కూడా ఇలాంటి వారి తీరుతో ఆనందించిన‌ట్టుగా క‌నిపించారు. బీజేపీలోనూ త‌న మ‌నుషులు కొంద‌రు ఉంటే.. అవ‌స‌రం అయిన‌ప్పుడు అటు నుంచి న‌రుక్కువ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌నేది చంద్ర‌బాబు మార్కు రాజ‌కీయ వ్యూహం అనేది వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.

రాజ్య‌స‌భ స‌భ్యుల సంగ‌త‌లా ఉంటే.. ఇప్పుడు వ‌రదాపురం సూరి లాంటి వాళ్లు మ‌ళ్లీ టీడీపీ వైపు చూస్తున్నార‌నే మాట వినిపిస్తూ ఉంది. బీజేపీ షెల్ట‌ర్ అవ‌స‌రం తీరిపోతూ ఉంది, ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల స‌మ‌యం ఉంది.  దీంతో.. కాషాయ కండువాలు ప‌క్క‌న పెట్టి మ‌ళ్లీ ప‌చ్చ‌కండువాలు వేసుకునే ప్ర‌య‌త్నాల్లో వ‌ర‌దాపురం సూర్య‌నారాయ‌ణ ఉన్నాడ‌నే టాక్ ఒక‌టి వ‌స్తోంది.

ఇంత‌లోనే ధ‌ర్మ‌వ‌రం టీడీపీ బాధ్యులుగా ఉన్న ప‌రిటాల వ‌ర్గం కూడా యాక్టివేట్ అవుతోంది. వ‌ర‌దాపురం సూరి బీజేపీలోకి వెళ్లిపోయాకా.. ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి చాన్నాళ్ల పాటు దిక్కూదివాణం లేదు. అయితే గ‌తంలో ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం త‌మ‌దంటూ చెప్పుకొచ్చిన ప‌రిటాల కుటంబానికి చివ‌ర‌కు ఆ బాధ్య‌త‌ల‌ను ఇచ్చారు చంద్ర‌బాబు. 

రాప్తాడు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న‌ప్పుడు ప‌రిటాల సునీత ధ‌ర్మ‌వ‌రం నుంచి త‌మ కుటుంబం నుంచి ఒక‌రు పోటీ చేయాల‌నే ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేసే ప్ర‌య‌త్నం చేశారు. ధ‌ర్మ‌వ‌రంలో టీడీపీ ఉనికిని నిలిపింది త‌న భ‌ర్త ప‌రిటాల ర‌వీంద్ర అని ఆమె చెప్పుకొచ్చారు. 2019 ఎన్నిక‌ల్లో ధ‌ర్మ‌వ‌రం నుంచి సూరిని ప‌క్క‌న పెట్టించి తమ ఇంటి నుంచి ఒక‌రు పోటీలో నిలిచేందుకు సునీత అన్ని ప్ర‌య‌త్నాలూ చేశారు. అయితే అప్ప‌ట్లో చంద్ర‌బాబు వారికి ఆ అవ‌కాశం ఇవ్వ‌లేదు.

క‌ట్ చేస్తే.. సునీత కోరుకున్న‌ట్టుగా ధ‌ర్మ‌వ‌రం ప‌గ్గాలు వ‌చ్చాయి కానీ, అప్ప‌టికే రాప్తాడు చేజారింది. రాప్తాడులో తిరిగి కోలుకోవ‌డానికే శ‌క్తియుక్తులు చాల‌ని ప‌రిస్థితుల్లో ధ‌ర్మ‌వ‌రం పై ప‌రిటాల ఫ్యామిలీ పూర్తిగా దృష్టి పెట్ట‌లేక‌పోయింది. అయితే వ‌ర‌దాపురం సూరి తిరిగి టీడీపీలోకి వ‌స్తాడ‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో మాత్రం మ‌ళ్లీ ప‌రిటాల కుటుంబం ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో తిరుగుతోంది! వ‌ర‌దాపురం సూరి అంటే గ‌తం నుంచినే ప‌రిటాల కుటుంబానికి ప‌డ‌దు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు అత‌డికి మ‌ళ్లీ చెక్ పెట్టే అవకాశం ప‌రిటాల కుటుంబం చేతిలో ఉంది.

అయితే..  ఈ వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు ఏం చేస్తార‌నేది అస‌లు సంగ‌తి. ప‌రిటాల కుటుంబం కోరుకున్న‌ప్పుడు చంద్ర‌బాబు ధ‌ర్మ‌వ‌రం బాధ్య‌త‌లు ఇవ్వ‌లేదు. వ‌ర‌దాపురం ప‌రార్ అయ్యాకా.. ప‌రిటాల కుటుంబం త‌ప్ప  మ‌రో ప్ర‌త్యామ్నాయం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు కూడా ప‌రిటాల కుటుంబానికి చంద్ర‌బాబు లాస్ట్ లో ఝ‌ల‌క్ ఇస్తాడ‌ని, వ‌ర‌దాపురం సూరి మ‌ళ్లీ ప‌చ్చ కండువా వేయించుకుని ధ‌ర్మ‌వ‌రం టికెట్ పొంద‌డం ఖాయమ‌నే టాక్ వినిపిస్తోంది. 

ప‌రిటాల కుటుంబంపై ఎప్పుడూ అంత సానుకూల ధోర‌ణిని క‌న‌బ‌ర‌చ‌ని చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి వారికి ఝ‌ల‌క్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌నే అభిప్రాయాలే ఇప్పుడు క్షేత్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. బీజేపీని షెల్ట‌ర్ గా వాడుకున్న వ‌ర‌దాపురం రేపోమాపో తిరిగి టీడీపీ నాయ‌కుడు అయిపోవ‌డం, ధ‌ర్మ‌వ‌రం అభ్య‌ర్థిగా రంగంలోకి దిగ‌డం ఖాయ‌మ‌ని టాక్!

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా