Advertisement

Advertisement


Home > Politics - Political News

వైఎస్సార్సీపీ సోష‌ల్ మీడియా మీట్.. లోప‌మేమిటో గుర్తిస్తున్నారా?

వైఎస్సార్సీపీ సోష‌ల్ మీడియా మీట్.. లోప‌మేమిటో గుర్తిస్తున్నారా?

ఒక‌వైపు సోష‌ల్ మీడియాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున స్పందించే వారికి ఆ పార్టీ వాళ్లు ఏదేదో చేసేస్తున్నారు అని అదే సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతూ ఉంటుంది. 

ఇలాంటి క్ర‌మంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల స‌మావేశం తాడేప‌ల్లిలో జ‌రుగుతూ ఉంది. అయితే ఈ స‌మావేశాల‌తో వ‌లంట‌రీగా ప‌ని చేసే కార్య‌క‌ర్త‌ల‌కు పెద్ద‌గా ఉప‌యోగం లేక‌పోగా, లోకం దృష్టిలో వైసీపీ సోష‌ల్ మీడియాకు ఏదో చేస్తున్నార‌నే భ్ర‌మలు మాత్రం క‌లుగుతున్నాయ‌నే మాట వినిపిస్తూ ఉంది.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావ‌డానికి ఆ పార్టీ సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్‌ల కృషి అమూల్యం. ఎందుకంటే సోష‌ల్ మీడియా ప‌రంగా ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి టీడీపీ ఎంతో స్ట్రాంగ్‌. దానికి తోడు ఆ పార్టీకి అప్ప‌ట్లో అధికారం అండ‌దండ అద‌న‌పు బ‌లం. 

చంద్ర‌బాబు పాల‌న‌కు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాలంటే ఎలాంటి రిస్క్‌నైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాల్సిన ప‌రిస్థితి. అలాంటి అడ్డంకుల‌న్నీ ఎదుర్కొని, బాబు అప్ర‌జాస్వామిక పాల‌న‌కు ఎదురొడ్డి సోష‌ల్ మీడియా ద్వారా పాల‌కుడిపై వ్య‌తిరేక‌త‌తో పాటు త‌మ నాయ‌కుడు జ‌గ‌న్‌పై పాజిటివిటీని క్రియేట్ చేయ‌డంలో వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు చురుగ్గా ప‌ని చేశారు.

అయితే వైసీపీ అధికారంలోకి రావ‌డం, జ‌గ‌న్‌ను సీఎంగా చూడాల‌న్న త‌మ ఆకాంక్ష‌లు నెర‌వేర‌డంతో చాలా ఆనందించారు. ఇదే స‌మ‌యంలో తొమ్మిదేళ్ల పాటు అష్ట‌క‌ష్టాలు ప‌డి పార్టీని అధికార తీరానికి చేర్చిన త‌మ‌ను ప్ర‌భుత్వం ఏ మాత్రం ప‌ట్టించుకోక‌పోవడంతో వైసీపీ సోష‌ల్ మీడియాకు చెందిన కొంద‌రు యాక్టివిస్టులు త‌మ అసంతృప్తిని, ఆగ్ర‌హాన్ని బాహాటంగానే వెళ్ల‌గ‌క్క‌డం స్టార్ట్ చేశారు. దీంతో పార్టీ పెద్ద‌లు మేల్కొన్నారు. న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఇందులో భాగంగా తాడేప‌ల్లిలో ఈ నెల ఒక‌టి నుంచి పార్టీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌తో ఆత్మీయ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌మావేశాలు ఈ నెల ఆరో తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. రోజుకు రెండు లేదా మూడు జిల్లాలకు చెందిన యాక్టివిస్టుల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు.

ఈ స‌మావేశంలో యాక్టివిస్టులు గ‌త తొమ్మిదేళ్ల‌లో ప‌డిన క‌ష్ట‌న‌ష్టాల‌తో పాటు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎలాంటి దుర్భ‌ర ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నామో క‌ళ్ల‌కు క‌డుతూ, పార్టీ పెద్ద‌ల క‌ళ్లు తెరిపించేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌లం అవుతున్నాయ‌నే మాట వినిపిస్తోంది.

రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్రాంతాల నుంచి తాడేప‌ల్లికి వాహ‌నంలో వెళ్లాలంటే ఎంతో వ్య‌య ప్ర‌యాస‌ల‌తో కూడుకున్న వ్య‌వ‌హార‌మ‌ని, ఒక్కొక్క‌రికి రూ.10 వేలు ఖ‌ర్చు అవుతున్న‌ట్టు యాక్టివిస్టులు చెబుతున్నారు.

ఇంత ఖ‌ర్చు పెట్టుకుని, సుదూరం ప్ర‌యాణించి క‌నీసం త‌మ గోడు కూడా చెప్పుకోడానికి అవ‌కాశం ఇవ్వ‌న‌ప్పుడు ఈ స‌మావేశాలు ఎందుకు నిర్వ‌హిస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని కొంద‌రు యాక్టివిస్టులు ప్ర‌శ్నిస్తున్నారు. స‌మ‌స్య‌ల‌ను రాసి ఇవ్వాల‌ని పేప‌ర్లు ఇస్తున్నార‌ని, అదేదో ఇంటి దగ్గ‌రే రాసి మెయిల్‌లో పంపేవాళ్లం క‌దా అని ప్ర‌శ్నిస్తున్నారు.  

ఈ స‌మావేశంలో పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌రువ‌ర‌న్నారు. సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల‌కు న్యాయ‌ప‌రంగా పార్టీ మ‌ద్ద‌తు సంపూర్ణంగా ఉంటుంద‌న్నారు.  అలాగే పార్టీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌లు ప్ర‌తి ఒక్క‌రికీ గుర్తింపు కార్డులిస్తామ‌న్నారు. వీటిని దుర్వినియోగం చేయ‌వ‌ద్ద‌ని సూచించారు.

అయితే గుర్తింపు కార్డులు ఏ ర‌కంగానూ లైసెన్సులు కాలేవు. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిన్న‌ర త‌ర్వాత కూడా ఇంకా మాట‌లు చెప్పాల్సిన స్థితిలోనే ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ! దీన్ని బ‌ట్టి లోపం ఎక్క‌డ ఉండో చూసుకోవాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తూ ఉంది.

ఒక‌వైపు త‌మ ప్ర‌త్య‌ర్థి సోష‌ల్ మీడియా విభాగం మ‌ళ్లీ ప‌నులు ప్రారంభిస్తున్న దాఖ‌లాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికీ మెజారిటీ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగానే ఉంది.

ఇలాంటి నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా మీదే త‌మ మూలాలు ఆధార‌ప‌డి ఉన్నాయ‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌క‌త్వం గుర్తించుకుంటే వారికే మంచిది. తీరా చేతులు కాలాకా ఆకులు ప‌ట్టుకునే ప‌రిస్థితి త‌లెత్త‌కుండా చూసుకోవాల్సి ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌క‌త్వం.

చంద్రబాబు కామెడీ లెక్చర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?