కాస్త వింతగా అనిపించినప్పటికీ విషయం ఉన్న కేసు ఇది. మహారాష్ట్రలోని పూణె జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఓ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన దానా తిన్న కోళ్లు గుడ్లు పెట్టడం మానేశాయి. దీంతో పౌల్ట్రీ యజమాని పోలీసుల్ని ఆశ్రయించాడు. తన కోళ్లు గుడ్లు పెట్టడం లేదని ఫిర్యాదు చేశాడు.
సదరు ఫిర్యాదు దారుడు ఓ పౌల్ట్రీ యజమాని. బిజినెస్ కూడా బాగానే సాగేది. అయితే ఎప్పుడైతే పక్కనే ఉన్న అహ్మద్‌నగర్ జిల్లాలోని ఓ కంపెనీ నుంచి కోళ్ల దానా తెచ్చి వాడడం మొదలుపెట్టాడో.. అప్పట్నుంచి తన ఫామ్ లో కోళ్లు గుడ్లు పెట్టడం మానేశాయనేది ఇతడి ఆరోపణ.
ఇందులో నిజం కూడా ఉంది. కొన్ని రకాల దానాలు తిన్న తర్వాత కోళ్లు గుడ్లు పెట్టడం మానేస్తాయి. అయితే సదరు కంపెనీ మాత్రం ఈ దానా తింటే కోళ్లు గుడ్లు పెట్టడంతో పాటు సైజు కూడా పెద్దగా ఉంటుందని ఊరించి మరీ అమ్మింది. అందుకే కేసు పెట్టాడు పౌల్ట్రీ యజమాని. ఇతడితో పాటు చుట్టుపక్కనున్న మరో 4 పౌల్ట్రీ ఫామ్స్ యజమానాలు కూడా ఈ సమస్య ఎదుర్కొన్నారు.
మహారాష్ట్రలో చికెన్, గుడ్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. కరోనా నుంచి రక్షణగా రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు గుడ్లు, చికెన్ తినమని అధికారులు చెబుతుండడంతో వీటికి గిరాకీ బాగా పెరిగింది. ఇలాంటి టైమ్ లో ఫామ్ లో కోళ్లన్నీ గుడ్లు పెట్టడం మానేయడంతో తనకు భారీగా నష్టం వచ్చిందని ఆ యజమాని ఆరోపిస్తున్నాడు.
యజమాని ఫిర్యాదును లోనీ కల్బోర్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ రాజేంద్ర మోకాషీ నిర్థారించారు. అయితే ఆయన ఈ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. నష్టపోయిన పౌల్ట్రీ రైతులందరికీ నష్టపరిహారం చెల్లించేందుకు సదరు కంపెనీ ముందుకు రావడంతో కేసు లేకుండానే చర్చలతో సమస్య పరిష్కారమైంది. పాత దానా కొనసాగించడంతో ఎప్పట్లానే కోళ్లు మళ్లీ గుడ్లు పెట్టడం స్టార్ట్ చేశాయి.