‘పవర్‌’ ఫైట్‌: కర్నాటకం.. ఇంకెన్నాళ్ళు.!

అధికారం కోసం యుద్ధం జరుగుతోందక్కడ.. ముఖ్యమంత్రి కుమారస్వామి ఏ క్షణాన అయినా తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి రావొచ్చు. ఏమో, కర్నాటకలో రాష్ట్రపతి పాలనే విధిస్తారో.. ఇంకేమన్నా అద్భుతాలు అక్కడ జరుగుతాయోగానీ, ప్రస్తుతానికైతే బీభత్సమైన…

అధికారం కోసం యుద్ధం జరుగుతోందక్కడ.. ముఖ్యమంత్రి కుమారస్వామి ఏ క్షణాన అయినా తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి రావొచ్చు. ఏమో, కర్నాటకలో రాష్ట్రపతి పాలనే విధిస్తారో.. ఇంకేమన్నా అద్భుతాలు అక్కడ జరుగుతాయోగానీ, ప్రస్తుతానికైతే బీభత్సమైన పొలిటికల్‌ డ్రామా నడుస్తోంది కన్నడ గడ్డ మీద.

తొలుత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.. పూర్తిస్థాయిలో తమకు బలం లేకుండానే. అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సి రావడంతో.. వెంటనే పదవిని కోల్పోయారాయన. కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి అధికార పీఠమెక్కాయిగానీ.. తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది కుమారస్వామి ప్రభుత్వం పరిస్థితి. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కూటమి నుంచి 17 మంది ఎమ్మెల్యేలు బయటకెళ్ళి రాజీనామా కూడా చేసెయ్యడంతో.. ముఖ్యమంత్రి కుమారస్వామి భవితవ్యం అగమ్యగోచరంగా తయారైంది. 

నైతికంగా చూస్తే, ఇప్పుడు కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయినట్టే లెక్క. కానీ, ఆ ప్రభుత్వాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కూటమి ప్రయత్నిస్తోంది. ఇందుకు అసెంబ్లీ వేదికగా పెద్ద నాటకమే నడుస్తోంది. సుప్రీంకోర్టులో పిటిషన్లు, అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలంటూ గవర్నర్‌ నుంచి లేఖలు.. ఇలా హై టెన్షన్‌ థ్రిల్లర్‌ మూవీని తలపించే ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి కర్నాటక రాజకీయాల్లో. 

ప్రస్తుతానికైతే చిన్న విరామం.. సోమవారం వరకూ కుమారస్వామి ప్రభుత్వానికి డోకా లేనట్టే. ఎందుకంటే, అసెంబ్లీ అప్పటిదాకా వాయిదా పడింది గనుక. ఈ వాయిదా కూడా కాంగ్రెస్‌ – జేడీఎస్‌ ప్రభుత్వం పన్నిన వ్యూహమే. ఆ వ్యూహం ప్రకారమే అక్కడి స్పీకర్‌ నడుచుకుంటున్నారు మరి. 

తమిళనాడులో రాజకీయ రచ్చ సృష్టించి, తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయించుకున్న బీజేపీ, ఇప్పుడు కర్నాటకలో సంక్షోభం సృష్టించి గద్దెనెక్కాలని చూస్తున్న మాట వాస్తవం. ఆ దిశగా బీజేపీకి విజయం కనుచూపు మేరలోనే కన్పిస్తోంది. కానీ, ఈలోగా అద్భుతాలు జరిగితే.. బీజేపీ ఆశలు అడియాశలైనట్లే. 'హార్స్‌ ట్రేడింగ్‌' జరగకూడదంటూ గవర్నర్‌, కర్నాటక ప్రభుత్వానికి రాసిన లేఖ ఇప్పుడు హాస్యాస్పదమవుతోంది. 

రాజకీయాలంటేనే హార్స్‌ ట్రేడింగ్‌గా మారిపోయిందిప్పుడు. దేశమంతటా దాదాపుగా ఇదే పరిస్థితి. ఆయా రాష్ట్రాల్లో హార్స్‌ ట్రేడింగ్‌ని కళ్ళప్పగించి చూస్తున్నారు చాలామంది గవర్నర్లు. కర్నాటకలోనూ అలానే చూస్తున్నా, వున్నపళంగా గవర్నర్‌కి 'నైతికతతోపాటు తన బాధ్యత' కూడా గుర్తుకొచ్చేసినట్టుంది.