మధ్యప్రదేశ్ నుంచి నెగ్గి వచ్చిన కాషాయధారిణి ప్రజ్ఞా ఠాకూర్ భారతీయ జనతా పార్టీకి తలనొప్పిగా మారారు. ఇది వరకే ఆమె తీరుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా విసుగు చెందారు. గాడ్సేను కీర్తిస్తూ ఆమె మాట్లాడిన మాటలను అప్పట్లోనే మోడీ ఖండించారు. ఆ మాటను తను క్షమించలేనంటూ మోడీ వ్యాఖ్యానించారు. తన పార్టీ ఎంపీనే అయినప్పటికీ మహాత్ముడిని చంపిన గాడ్సేను ప్రజ్ఞా కీర్తించడాన్ని మోడీ సమర్థించలేకపోయారు.
అయితే ఆమె తన తీరును మార్చుకోలేదు. మరోసారి అదే మాటే మాట్లాడారు. లోక్ సభలో గాడ్సేను కీర్తించారు. గాడ్సేను దేశభక్తుడంటూ పొగిడారు. ఇది భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరంగా మారింది. జాతిపిత మహాత్ముడిని చంపిన వ్యక్తిని ఇలా అధికార పార్టీ ఎంపీ కీర్తించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తూ ఉంది.
ప్రజ్ఞాకు కొంత హింసాత్మక హిందుత్వ వాదం ఇమేజ్ ఉంది. ఒక పేలుళ్ల కేసులో ఆమె జైలు పాలయ్యారు కూడా. అయినప్పటికీ బీజేపీ ఆమెకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. తీరా గెలిచాకా ఆమె తీరు కమలం పార్టీకే ఇబ్బందికరంగా మారింది.
ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వాళ్లు ఆమెను పక్కన పెడుతున్నారు. మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీల సమావేశానికి ఆమెను ఆహ్వానించలేదు. మరోవైపు ఈ బీజేపీ ఎంపీని టెర్రరిస్ట్ అంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.
'టెర్రరిస్ట్ అయిన గాడ్సేను మరో టెర్రరిస్ట్ అయిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ దేశభక్తుడంటూ కీర్తించారు..' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.