విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డెత్ వార్నింగ్ ఇచ్చారు. చావు కోసం కాచుకోవాలని ఆయన్ను హెచ్చరించారు. అంతే కాదు, ఈ నెల 29న అంతమొందిస్తామని డేట్ కూడా ఖరారు చేశారు. ప్రకాశ్‌రాజ్‌తో పాటు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, మరో 13 మందిని కూడా హత్య చేస్తామని దుండగులు హెచ్చరించారు. హెచ్చరికకు గురైన వారిలో ఓ స్వామీజీ కూడా ఉండటం గమనార్హం. కర్నాటకలోని బెళగావిలోని నిజగుణానందస్వామి మఠానికి హెచ్చరికకు సంబంధించిన లేఖ వెళ్లింది.
సంఘ్ పరివార్‌ని విమర్శించడమే వీరంతా చేసిన తప్పిదం. కన్నడలో రాసిన ఆ లేఖలో ఏం ఉందంటే…
‘ధర్మ ద్రోహులు, దేశ ద్రోహులను ఈ నెల 29న అంతమొందించాలని నిర్ణయించాం. అందుకు తగ్గ ముహూర్తం కూడా పెట్టాం. మీ జీవితంలో చివరి ప్రయాణానికి సిద్ధంకండి. నిజగుణానందస్వామీ మీరు ఒక్కరే కాదు. దిగువ ఉన్న పేర్లు చూడండి. వారిని కూడా చివరి ప్రయాణానికి మీరే సిద్ధం చేయాలి’ అని ఉంది. ఈ పేర్లలో ప్రకాశ్‌రాజ్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్లు కూడా ఉన్నాయి.
కాగా ఈ లేఖను సంబంధిత జిల్లా ఎస్పీకి ఆశ్రమ వాసులు అందజేశారు. దుండగులు ఇచ్చిన డెత్ వార్నింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆశ్రమానికి భద్రత కల్పిస్తామని పోలీసులు కోరగా, వద్దని మఠాధిపతి సున్నితంగా తిరస్కరించారు. అయితే తనకొచ్చిన బెదిరింపులపై కుమారస్వామి ట్విటర్ వేదికగా పంచుకున్నారు.