యాదగిరి నరసింహుడు ప్రత్యేక హోదా ఇస్తాడా?

మన దేశంలో దేవుడి పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటివారిని భక్తిపరులు అంటుంటారు. సామాన్యులకు భక్తి అనేది వ్యక్తిగత విషయం. కానీ రాజకీయ నాయకులకు భక్తి అనేది రాజకీయం. వారిలో కూడా…

మన దేశంలో దేవుడి పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటివారిని భక్తిపరులు అంటుంటారు. సామాన్యులకు భక్తి అనేది వ్యక్తిగత విషయం. కానీ రాజకీయ నాయకులకు భక్తి అనేది రాజకీయం. వారిలో కూడా నిజమైన భక్తులు ఉండరా? అనే ప్రశ్న వస్తుంది. తప్పనిసరిగా ఉంటారు. కానీ మెజారిటీ రాజకీయ నాయకులు భక్తితో, భగవంతుడితో రాజకీయాలు చేస్తారు.అంటే దేవుడిని అడ్డం పెట్టుకొని పాలిటిక్స్ నడిపిస్తారన్న మాట.

అధికారంలో ఉన్నవారే కాదు, అధికారం కావాలనుకొంటున్న వారు కూడా భక్తి పేరుతో హంగులు, ఆర్భాటాలు చేస్తారు. ఫలానా రాజకీయ నాయకుడు మహా భక్తిపరుడనే పేరు తెచ్చుకుంటారు. కానీ ఇలాంటివారు నోరు విప్పితే బూతులు మాట్లాడతారు. చేయాల్సిన అవినీతి పనులు చేస్తూనే ఉంటారు. భక్తికి, రాజకీయ మనుగడకు సంబంధం లేదంటారా? దేని దారి దానిదే అంటారా ? సరే అలాగే కానివ్వండి.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నిన్న కలకలం రేగింది. తెలుగు రాష్ట్రాల్లోని విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక సమావేశం పెట్టబోతోంది. ఇందుకోసం త్రిసభ్య కమిటీ వేసింది. ఆ సమావేశం కోసం తయారు చేసిన అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని కూడా పొందుపరిచింది. ఈ మధ్యనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రత్యేక హోదా గురించి పార్లమెంటులో ప్రస్తావిచారు. దాని ప్రభావంతో ప్రత్యేక హోదా అంశాన్ని అజెండాలో పెట్టారని అనుకున్నారు. పోనీలే …ఇన్నేళ్లకైనా కేంద్రానికి దయ కలిగిందని జనం మురిసిపోయారు.

ఇక వైసీపీ నాయకులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అసలే వాళ్లకు స్వామి భక్తి ఎక్కువ. ప్రభుత్వం చేసే ఏ పనికైనా వైసీపీ నాయకులు, మంత్రులు మురిసి ముక్కలవుతుంటారు. ప్రత్యేక హోదాను అజెండాలో చేర్చారంటే ఆగుతారా. జగనన్న అన్నాడు…హోదా తెచ్చాడు అంటూ జగన్ మీడియా రోజంతా ఊదరగొట్టింది. కానీ సాయంత్రంకల్లా ప్రత్యేక హోదా అంశం అజెండా నుంచి ఎగిరిపోయింది. షరా మాములుగా ఇలా కావడానికి చంద్రబాబే కారణమని విరుచుకుపడ్డారు.

కానీ హోదా ఇవ్వ‌డం అన్న‌ది అనుకున్నంత సులువు కాదు అని నిపుణులు చెబుతున్నారు. ఒక‌వేళ ఆంధ్రాకు హోదా ఇచ్చినా తెలంగాణా అందుకు ఒప్పుకోదు. తమకూ హోదా కావాలని టీఆర్ఎస్ నాయకులు  రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లోనే డిమాండ్ చేశారు. ఎందుకంటే తాము ఆంధ్రా క‌న్నా చాలా విష‌యాల్లో వెనుక‌బ‌డి ఉన్నామ‌ని, వెనుబ‌డిన ప్రాంతాలు అన్న‌వి త‌మ ద‌గ్గ‌రే ఎక్కువ‌ని ఓ వాదం వినిపించ‌వ‌చ్చు.

తెలంగాణా ఊరుకున్నా ఒడిశా ఊరుకోదు. బీహార్ అంత‌క‌న్నాఊరుకోదు. ఈ తలనొప్పి ఎందుకని ప్రత్యేక హోదా అంశాన్ని అజెండా నుంచి లేపేశారు. హోదా అంశం మొదట అజెండాలో పెట్టడం, తరువాత తీసేయడం ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కు తెలుసో లేదో మనకు తెలియదు. ఆయన నిన్న యాదాద్రికి వచ్చారు. యాదాద్రి ఆలయ వైభవాన్ని చూసి మురిసిపోయారు. మరి ఆలయానికి వచ్చాక ఏదో ఒకటి మొక్కుకోవాలి కదా.

ఏపీకి త్వరగా ప్రత్యేక హోదా రావాలని పినిపే విశ్వరూప్ మొక్కుకున్నారు. ఇదే విషయంలో ఆయన తిరుపతి వెంకన్నను ఎప్పుడైనా మొక్కుకున్నాడో లేదో తెలియదు. యాదాద్రి నరసింహుడు చాలా పవర్ ఫుల్ అని ఎవరైనా చెప్పారో ఏమోగానీ ఇక్కడ మొక్కుకున్నాడు. ప్రత్యేక హోదా మోడీ ఇవ్వాలిగానీ ఎంత పవర్ ఫుల్ దేవుడైనా ఇవ్వలేడు. సీఎం జగన్ మిగతా విషయాల్లో పవర్ ఫుల్ అయివుండొచ్చు. కానీ ప్రత్యేక హోదా సాధించే విషయంలో మాత్రం పవర్ లెస్.