దేశంలో కొన్ని ప్రముఖ రైల్వే స్టేషన్లలో ఆపి ఉంచిన రైల్ బోగీల్లో వ్యభిచారం నడుస్తూ ఉందనే ఆరోపణ తరచూ వినిపిస్తూ ఉంటుంది. అదంతా రైల్వే అధికారులకు కూడా తెలిసే జరుగుతూ ఉంటుందని, ఎవరి వాటాలు వారికి వెళ్లిపోతూ ఉంటాయంటారు. అయితే రైల్లే కాదు, బస్సులు కూడా ఈ తరహా వ్యభిచారానికి కేంద్రం అవుతున్నాయట.
ఇలాంటి అతి తెలివి ప్రాస్టిట్యూషన్ కు దివాకర్ ట్రావెల్ బస్సులు కూడా వేదికలు అవుతున్నాయనే ఆరోపణ పాతదే. ఇందుకు సంబంధించి ఇప్పుడు చర్చ మళ్లీ తెర మీదకు వచ్చింది. గతంలోనే ఇందుకు సంబంధించి ఆధారాలు దొరకడం, అప్పట్లోనే దివాకర్ స్లీపర్ బస్సు ఒకదాన్ని సీజ్ చేయడం జరిగిందట. 2012లోనే ఈ మొబైల్ వ్యభిచారం గుట్టు బయటకు వచ్చింది. ఇప్పుడు దివాకర్ రెడ్డి బస్సులు భారీ ఎత్తున సీజ్ అయిన నేపథ్యంలో.. ఆయన ట్రావెల్స్ లీలలు చర్చనీయాంశంగా మారాయి.
మరీ స్లీపర్ బస్సులను వ్యభిచారానికి కేంద్రంగా మార్చడం అలాంటిలాంటి వ్యవహారం కాదు.అధికారికంగా ఆయా ట్రావెల్స్ బస్సుల యజమానులే ఇలాంటి పనులు చేయించినా, అవకాశాన్ని చూసి డ్రైవర్లు -క్లీనర్లే ఈ పని చేయించినా ఏ మాత్రం క్షమార్హం కాదు. అవి ప్రైవేట్ బస్సులే అయినా, సామాన్య ప్రజలు ఉపయోగించేవి. ట్రావెలర్స్ బాదుడులను తట్టుకుంటూ ప్రజలు ప్రైవేట్ బస్సులను ఎక్కుతున్నారు. అలాంటి వాటిల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు విస్మయాన్ని కలిగించేవే. అధికారం ఉన్నప్పుడు దివాకర్ ట్రావెల్స్ దందాలేవీ బయట పడలేదు. ఇప్పుడు ట్రావెల్స్ ముసుగులో జరిగిన దందాలు అన్నీ ఒక్కొక్కటిగా తెర మీదకు వస్తున్నాయి.