పోలీసులను అంతా ఇపుడు గుర్తు చేసుకుంటున్నారు. వారిని పొగిడే వారి కంటే తిట్టుకునే వారే ఎక్కువ. ఎందుకంటే తమను ఎక్కడికీ వెళ్ళనీయడంలేదని, తమ స్వేచ్చను హరించే అతి పెద్ద శత్రువు వారేనని కూడ జనంలో భ్రమల్లాంటి ఆవేశాలున్నాయి.
అయితే కరకులా కనిపించే ఖాకీలు కూడా మనుషులే. వారికి కూడా కుటుంబం ఉంది. అయినా సరే అన్నీ వదిలేసి కరోనాపై నడి వీధిలో ఒంటరిగా నిలబడి పోరాడుతున్నారు.
కరోనాను మేము అడ్డు అంటున్నారు. మీరు హాయిగా ఇళ్ళకెళ్ళి నిశ్చింతగా ఉండండని కూడా భరోసా ఇస్తున్నారు. అటువంటి ఖాకీల విషయంలో ఉన్న అపోహాలు పోగొట్టేలా, వారి మీద మరింత ప్రేమ, బాధ్యత పెరిగేలా ఒక వైసీపీ ఎమ్మెల్యే చేసిన పని అందరికీ ఆశ్చర్యం కల్గించింది.
విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ఏకంగా పోలీస్ పెద్దాయనకు సాష్టాంగం పడి మరీ మొక్కాడు. మీరు దేవుళ్ళయ్యా అంటూ కన్నీళ్ళతో కాళ్ళు కడిగాడు, మీరు లాక్ డౌన్ పేరిట అందరినీ ఇళ్ళలో ఉంచి గస్తీ కాస్తున్నారని కితాబు ఇచ్చాడు. సమాజం సుస్తీన పడకుండా చూసే సిసలైన వైద్యులు అంటూ కీర్తించాడు.
ఒక ఎమ్మెల్యే ఎపుడూ పోలీసులను వాడుకోవడమే తప్ప ఇలా సమాదరించింది, నెత్తిన పెట్టుకుని గౌరవించిందీ లేదు. కానీ అరకు వైసీపీ ఎమ్మెల్యే చేసిన ఈ పనితో ఖాకీలు నిజంగా కనబడని నాలుగో సింహంలా గర్వంతో మెరిసిపోతున్నారు. సామాజిక మాధ్యమాలలో అది చూసిన వారంతా భేష్ ఎమ్మెల్యే గారు అంటున్నారు.