మూడు సార్లు ముఖ్యమంత్రి పదవి చెయ్యటం కన్నా, ఒక్క సారి గవర్నర్ కుర్చీలో కూర్చోవటం మేలు. అదేమిటి? గవర్నర్ పదవికిహొదా తప్ప, అధికారం వుండదు కదా! కూర్చుని ఏం లాభం? కూర్చుని చూస్తే తెలుస్తుంది. కూర్చున్నవారికే కాదు, కూర్చోబెట్టిన వారికి కూడా లాభమే. సంపూర్ణమైన రాజకీయ లాభం. ఈ లెక్క తిరకాసుగా వుంటే, ఒక్కసారి పుదుచ్చేరి వెళ్ళి రావాలి.
సొంత పార్టీకి ‘సున్నా’ సీట్లు వచ్చాయని, కేంద్రంలోవున్న వారు దిగులు పడలేదు. సున్నా పక్కన లాఠీ పెట్టారు. ఎడమవైపే లెండి. లాఠీ అంటే అంకెల్లో ‘ఒకటి’ లా వుంటుంది. దాంతో సున్నా పది (10) అవుతుంది. ద్విగుణీకృత ఉత్సాహంతో రెండో లాఠీ కూడా పెట్టే వారే. అప్పుడు నూటపది(110) అయ్యేది. కానీ అది బుల్లి రాష్ర్టం. ఉన్నవి 30 సీట్లే. అది రాష్ర్టం కూడా కాదు. కేంద్ర పాలిత ప్రాంతం. అక్కడ గవర్నర్ అంటే ఆషామాషీ కాదు. గవర్నర్ గా ఎవరిని వేసినా ‘లెఫ్టినెంట్ గవర్నర్’ అయిపోతారు.
అసలే మాజీ పోలీసు అధికారిణి ఏమో, ఆమె అత్యంత శక్మింతమైన లెఫ్టినెంట్ గవర్నర్గా అయిపోయారు. దాంతో బీజేపీ పంట పండిపోయింది. ఎన్నికయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గింజుకున్నా, పూర్తికాలం కొలువు తీరలేక పోయింది. శాసనసభకు గడువుకు ముందే నూకలు చెల్లిపోయింది. రాష్ర్టపతి పాలన వచ్చేసింది. ఇక ఎన్నికలే తరువాయి. సమరోత్సాహంలో వున్నారు బీజేపీ నేతలు. గెలిచి తీరతామంటున్నారు కూడా.
పుదుచ్చేరి ఎంత చిన్నదో, దాని కథ కూడా అంతే చిన్నది. అది 2016 పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలకు జరిగిపోయాయి. మొత్తం 30 సీట్లలో కాంగ్రెస్కు 15, దాంతో జతకట్టిన డిఎంకె కు 2, వెరసి 17 సీట్లు వచ్చేశాయి. అంటే సునాయసంగా కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చెయ్యవచ్చు. ప్రతిపక్షంగా వున్న ఎన్ఆర్ కాంగ్రెస్కు సీట్లు, ఎఐఎడిఎంకె కు 4 సీట్లూ వచ్చాయి. అన్నట్లు బీజేపీ కూడా పోటీలో వుంది. సీట్లు మాత్రం ‘సున్నా’. ఇందులో ఎవరు మాత్రం చేసేదేముంది?
కాంగ్రెస్ సర్కారును ఏర్పాటు చేసుకోవచ్చు. మరి ముఖ్యమంత్రి ఎవరు? ఈ ప్రశ్న ఎక్కడయినా వెయ్యవచ్చు కానీ, కాంగ్రెస్ లో వెయ్యకూడదు. పదిహేను పేర్లు వస్తాయి. అదేమిటి ఉన్న శాసన సభ్యులే పదిహేను మంది కదా! ‘నేను ముఖ్యమంత్రి అభ్యర్థికి ఎందులో తక్కువ?’ అని పదిహేను మందీ అనుకోవచ్చు.
కానీ అనుభవం, వయసూ లెక్క చూపే వారు కొందరు వుంటారు. ఉన్నారు. నమశ్శివాయం. అవును ఆయన పేరే. కానీ, కాంగ్రెస్ అధిష్ఠానం అలా ఆలోచించక పోవచ్చు. ఆ క్షణానికి సమశ్శివాయం కాకుండా, నారాయణ స్వామి నమ్మిన బంటులా కనిపించవచ్చు. కనిపిచేశాడు. అంతే! ‘ఎ. నారాయణ స్వామి అను నేను పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా…’ అంటూ ప్రమాణం చేసేశారు. ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలించటమే తరువాయి. అని అనుకున్నారు.
అంతలో హెర్ ఎక్సలెన్సీ కిరణ బేడీ దిగారు. అన్నీ పనులూ చక చకా జరిగిపోతున్నాయి. నారాయణ స్వామి చెయ్యాలనుకున్నవీ, చెయ్యటం మరచిపోయినవీ, చెయ్యవచ్చులే అని బధ్ధకించినవీ అన్నీ కిరణ్ బేడీయే చేసేస్తున్నారు. ఎవరో అధికారి సోషల్ మీడియా లో అసభ్యకరమైన పోస్టు పెడతాడు. ఇంక ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళదు. ఈ లోగానే సస్పెన్షన్ ఉత్తర్వులు. జనం మెచ్చే పని గవర్నర్ చేస్తే ఏమి? నారాయణస్వామి చేస్తే ఏమి? కిరణ్ బేడీ ఒక రోజున రోడ్డు మీద హెల్మెట్లు లేకుండా టూవీలర్స్ మీద జనం తిరగటం చూస్తారు. ‘ప్రాణాలకు ముప్పుకదూ!’ అని అనుకుంటారు.
నారాయణస్వామి సర్కారుకు చెప్పి ‘హెల్మెట్ నిబంధన’ చెయ్యించవచ్చు. ఈ లోపుగా కొన్ని ప్రాణాలు గాల్లో కలసి పోతే..? అందుకే మేడమ్ కిరణ్ బేడీ ఉత్తర్వులు విడుల చేసేస్తారు. అలాగే ఇంకోసారి దిక్కులేని పేదల్ని బేడీ చూసివుండవచ్చు. ‘ఏం వీళ్ళకు ఉచితంగా బియ్యం ఇస్తే తప్పేముంది?’ అని అనుకుంటారు. ఈ మాత్రం పని కూడా ముఖ్యమంత్రి చేత చెయ్యించాలా? లెఫ్ట్నెంట్ గవర్నర్ గా తన మాటే శాసనం కదా! అంతే మాట అనేశారు. బియ్యం సిధ్ధం. ముఖ్యమంత్రి నిధి నుంచి సహాయం ఎవరు చేస్తారు? ముఖ్యమంత్రే చెయ్యాలా? ఏం గవర్నర్ చేస్తే తప్పేమిటి?
చూశారా? వారు వీరయ్యారు; వీరు వారయ్యారు. అన్ని చోట్లా ముఖ్యమంత్రి చేస్తుంటారు; గవర్నర్ చూస్తుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. గవర్నర్ చేస్తుంటే, ముఖ్యమంత్రి చూస్తూ వుండి పోయారు. మధ్యమధ్యలో ‘నేను ముఖ్యమంత్రిని’ కదా అని ఉలిక్కిపడి లేచేవారు. రోడెే్లక్కవారు, ప్రదర్శనలు చేసేవారు. కానీ అక్కడ వున్నది లెఫ్ట్ నెంట్ గవర్నర్ కదా! తన అధికారాలు ఆమె సంపూర్ణంగా సద్వినియోగ పరచుకుంటున్నారు. సేవా కార్యక్రమాలు ఇలా చేసుకుపోతున్నప్పుడు జనానికి మాత్రం ఎందుకు ఇబ్బందిగా వుంటుంది?
కానీ కిరణ్ బేడీ తన ఉదారదృష్టిని అసెంబ్లీ వైపు కూడా సారించారు. అసెంబ్లీ సంఖ్య 30. ఈ అంకె ఎందుకో నచ్చలేదు. ఇంకో మూడు కలిపితే 33 అవుతుంది కదా! అనుకున్నారు. కలిపేశారు. గవర్నర్ నామినేట్ చెయ్యవచ్చు కదా! చేసేశారు. ఆ ముగ్గురూ ఎవరయినా కావచ్చు. అది గవర్నర్ ఇష్టం. వాళ్ళు ముగ్గురూ బీజేపీ వారే కావచ్చు.
అందులో ఒకరు ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి కావచ్చు. (కావచ్చేమిటి? వి.సామినాథన్ అనీ, బీజేపీ తరపున పోటీ చేస్తే 1509 వోట్లు వచ్చాయి. డిపాజిట్టు కు బహుదూరం లెండి!). ప్రతిపక్షాల వారు ఉడుక్కుని సుప్రీం కోర్టు వరకూ వెళ్ళారు. చట్టం లెఫ్ట్నెంట్ గవర్నర్ వైపే వుందని తేలింది. బీజేపీకి సంఖ్య అలా సున్నా నుంచి మూడుకు పెరిగింది. ఎన్నార్ కాంగ్రెస్, ఎఎఐఎడింకెలతో దోస్తీ ఎలాగూ వచ్చిపడింది. దాదాపు కాంగ్రెస్ కున్న సీట్లకు సమానంగా సంఖ్య పెరిగింది. కిరణ్ బేడీని గవర్నర్ను తప్పించారు.
తర్వాత కార్యాన్ని వ్యూహకర్తలు సులభంగా పూర్తి చేయగలరు. ఫిరాయింపు చట్ట నిబంధనను తప్పించుకుంటూ, సర్కారును కూల్చాలంటే ‘కర్ణాటక మోడల్’ వుండనే వుంది. ప్రతిపక్ష సభ్యులను పదవీ త్యాగానిక పురికొల్పటం. ‘దూకటం’ కాదు, ‘ఎమ్మెల్యే పదవిని వదలుకోవటం’. కాంగ్రెస్ శాసన సభ్యులు జారిపోతూ వచ్చారు.
మొత్తం సంఖ్య తగ్గి పోయింది. కాంగ్రెస్ సంఖ్య పడిపోయింది. విశ్వాస తీర్మానం లో ఓడిపోతానని తెలిసి నారాయణ స్వామి కూలిపోయారు. ఒకప్పటి హీరో జీరో అయ్యారు. అప్పటి జీరో తెచ్చుకున్న బీజేపీ ఇప్పుడు హీరో అవుతారా? అంతా చట్టబద్ధంగానే జరిగిపోయింది. మరి జనం తీర్పు మాటేమిటి?
సతీష్ చందర్