భారతదేశంలో పాలనలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన ప్రధాని పీవీ నరసింహారావు అపర చాణక్యుడిగా పేరు పొందారు. బహుభాషా పండితుడైన పీవీ మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు దిగ్విజయంగా నడిపిన నేర్పరితనం, రాజకీయ కౌటిల్యం తన సొంతమని నిరూపించారు. ఆయన మన తెలుగు వ్యక్తి కావడం గర్వకారణం.
దేశ గర్వించదగ్గ ప్రధానిగా అందరి మన్ననలు పొందిన పీవీ నరసింహారావు చిన్న కుమార్తె డాక్టర్ విజయ సోమరాజు ప్రస్తుతం కరోనాపై సమరం సాగిస్తున్నారు. వైద్యురాలిగా ప్రాణాలను పణంగా పెట్టి కరోనాపై పోరాటం సాగిస్తున్నారు. అమెరికాలో విస్కాన్‌సిన్ సిటీలోని బిలాయిట్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ అయిన డాక్టర్ విజయ ఇన్‌ఫెక్షన్ డిసీజెస్ స్పెషలిస్ట్‌గా ప్రఖ్యాతిగాంచారు.
అలాగే యూఐసీ యూనివర్సిటీలో అవుట్ స్టాండింగ్ టీచింగ్ అవార్డు గ్రహీతైన ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిలో క్లినికల్ ప్రొఫెసర్‌గా వివిధ విభాగాలలో సేవలందిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో భీతావహం సృష్టిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు రోజుకు 12 నుంచి 14 గంటల వరకు పీపీఈ సూట్ ధరించి కరోనా రోగులకు ఆమె సేవలందిస్తున్నారు.
భౌతిక దూరం పాటించడ ద్వారానే కరోనాపై విజయం సాధిస్తామని ఆమె గట్టిగా చెప్పారు. దానికి మించిన మందు మరొకటి లేదని ఆమె స్పష్టం చేశారు. డాక్టర్ విజయ భర్త ప్రసాద్ సోమరాజు. ఈయన 30 ఏళ్లుగా ఆమెరికాలో వైద్యసేవలందిస్తున్నారు. కొతగూడెం సమీపంలోని రేగళ్ల ఆయన స్వగ్రామం. ప్రస్తుతం దంపతులిద్దరూ కరోనాపై అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు.