తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య రాధిక పోటీ చేస్తుందంటూ ప్రకటించారు అక్కడి సినిమా హీరో, రాజకీయ నేత శరత్ కుమార్. ఒకానొక దశలో వరస విజయాలతో తమిళనాట మంచి స్టార్ డమ్ సంపాదించుకున్న శరత్ కుమార్ చాలా త్వరగానే తన ఇమేజ్ ను రాజకీయాల వైపు తీసుకెళ్లారు.
సొంతంగా పార్టీ పెట్టారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసే ప్రయత్నాలేవీ చేయకుండా పెద్ద పార్టీలతో చేతులు కలిపి.. తనొక టికెట్, తను చెప్పిన ఒకరిద్దరికి టికెట్ లు పొందుతూ వచ్చారు.
గతంలో జయలలిత ఉన్నప్పుడు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఒకసారి ఎమ్మెల్యే కూడా అయ్యారు శరత్ కుమార్. అప్పట్లో ఈయన తరఫున నిలిచిన మరో అభ్యర్థి కూడా విజయం సాధించారు. అయితే ఆ తర్వాత మాత్రం శరత్ కుమార్ కు ఓటమి తప్పలేదు.
ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిని మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూ ఉన్న శరత్ కుమార్, మరోసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు తన పార్టీ సమాయత్తం అవుతోందని ప్రకటించాడు.
అన్నాడీఎంకేతో పాటు పోటీ చేస్తుందట శరత్ కుమార్ పార్టీ. ఈ సారి పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లను డిమాండ్ చేస్తారట. జయలలిత లేకపోవడంతో.. అన్నాడీఎంకే ను అందరూ డిమాండ్ చేసే వాళ్లే అయినట్టున్నారు!
ఇక ఈ సారి తను ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని, తన భార్య రాధిక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని శరత్ కుమార్ ప్రకటించడం గమనార్హం. ఇది వరకూ ఈ భార్యాభర్తలు మూవీ ఆర్టిస్ట్స్ ఎన్నికల్లో కూడా ఆధిపత్యాన్ని కొంతకాలం పాటు చెలాయించి, ఆ తర్వాత ఓటమిని మూటగట్టుకున్నారు. దక్షిణాదిన నటిగా మంచి గుర్తింపు ఉన్న రాధిక తమిళనాడు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా వెళ్లగలదేమో చూడాలి!