కేంద్రంలో అధికారంలో ఉన్న తమను ఎవరూ ఏమీ చేయలేరనే లెక్కలేని తనమో, లేక ఉచిత ప్రచారం పొందాలనే యావో తెలియదు….కానీ తెలంగాణ బీజేపీ నేత నోరు పారేసుకున్నాడు. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు సంచలన కామెంట్స్ చేశాడు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది.
మోడీ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిపై అవాకులు చెవాకులు పేలాడు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ల తలలు నరికేందుకు కత్తి పట్టాలంటూ ఆయన బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చాడు. దీంతో ఆ సభలో ఉన్న బీజేపీ నాయకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కాసేపు తత్తరపాటుకు గురయ్యారు.
ఎవరెలా ఉన్నా…రఘునందన్ మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగించాడు. సీఏఏకు వ్యతిరేకంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గల్లీ తీర్మానాలతో కేంద్రాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాయంటూ ఆయన మండిపడ్డాడు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఉడత ఊపులకు భయపడేందుకు కేంద్రంలో ఉన్నది రాజీవ్, మన్మోహన్సింగ్ ప్రభుత్వాలు కావని అన్నాడు.
కాగా రఘునందన్‌రావుపై ఇటీవల ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేయడంతో సొంత పార్టీ ఆయన్ను పక్కన పెట్టినట్టు తెలిసింది. తాను నిర్దోషిగా నిరూపించుకున్న తర్వాతే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని స్వయంగా ప్రకటించిన రఘునందన్…తాజాగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేశారనే అంశంపై చర్చ జరుగుతోంది.
కేవలం తన ఉనికి చాటుకునేందుకే ఆయన “తలలు నరుకుతాం” లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉంటాడని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. అదే సభలో ఉన్న సైదాబాద్ టీఆర్ఎస్ కార్పొరేటర్ స్వర్ణలతారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినా…రఘునందన్ పట్టించుకోకపోవడం గమనార్హం.