నర్సాపురం నుంచి వైసీపీ తరపున గెలుపొందిన ఎంపీ ఆయన. వైసీపీతో విభేదించి ప్రత్యర్థుల పంచన చేరిన ‘రాజు’ ఆయన. ఢిల్లీలో ‘రచ్చబండ’ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో సొంత ప్రభుత్వంపై తనదైన రీతిలో పెదరాయుడు తీర్పులు చెబుతున్నారు. దండన విధించాల్సిన ‘రాజు’ గారు దండనకు గురయ్యారు. తాను థర్డ్ డిగ్రీకి గురయ్యానని, ఆర్తనాదాలు చేశానని స్వయంగా ఆయనే చెబుతుంటే… ఆ కిక్కే వేరబ్బా అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఇంతకూ ఆయన ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరి పేరు చెబితే సీఐడీ గుర్తుకొస్తుందో, ఎవరి పేరు చెబితే ఆర్తనాదాలు మార్మోగుతాయో, ఆయనే రఘురామకృష్ణంరాజు.
పాముకు పాలు పోసి పెంచిన చందంగా, ఆయన గురించి అన్నీ తెలిసీ ఎంపీగా గెలిపించుకున్నారు. ఇప్పుడాయన ఎల్లో మీడియాకు ఆర్‌ఆర్‌ఆర్. పేరు గొప్పగా ఉన్నా, ఆయన ఆవేదన వింటే మాత్రం అయ్యో పాపం అనే జాలి కలగకుండా ఉండదు. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ఇంటర్వ్యూలో తన ఆవేదనను మరోసారి బయట పెట్టుకున్నారు. ఏపీ పోలీసులు ఆయన ఒళ్లుపై కొట్టిన దెబ్బలు మానాయే తప్ప, మనసుకు అయిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ గాయాలు తన ప్రాణం ఉన్నంత వరకూ నీడలా మనసును వెంటాడుతాయని చెప్పకనే చెప్పారు.
ఆ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ అలియాస్ రఘురామ ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
‘నా జీవితంలో ఎప్పుడూ దెబ్బలు తినలేదు. మంచి విద్యార్థిని కాబట్టి. బడిలో టీచర్లతో కూడా తన్నులు తినాల్సిన అవసరం రాలేదు. కానీ… ఫస్ట్ దెబ్బే పోలీసు దెబ్బ. ఎంపీ అయి ఉండి కొట్టించుకోవడం ఒక రికార్డుగా మిగిలిపోయింది. సినిమాల్లో ఎవరినైనా కొడితేనే నేను బాధపడతాను. అలాంటిది నేనే తన్నులు తినాల్సి వస్తుందని ఊహించలేదు. ఆ కొట్టుడు మామూలు కొట్టుడు కాదు’
‘పోలీసులు అర్ధరాత్రి నా ఇంటిపై దాడి చేసి, నన్ను ఎత్తి జీపులో పడేశారు. ఆ తర్వాత నన్ను చాలా చిత్రహింసలకు గురి చేశారు. స్వతంత్ర భారత దేశంలో తొలిసారిగా ఒక ఎంపీ మీద పోలీసులు ఇలా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు’
‘ఆర్తనాదాలను చూసి ఆ పైవాడు ఆనందించాడు. స్పైడర్ సినిమాలో ఒక శాడిస్టిక్ విలన్ ఉంటాడు కదా! అలాగే ఆ పైవాడు కూడా విపరీతంగా ఆనందించాడట. ‘ఆర్తనాదములు శ్రవణానందకరంగా ఉన్నవి’ అని మాయాబజార్‌లో ఎస్వీ రంగారావు అన్నట్లు ఆ పైవాడు కూడా ఆనందించి, ఇంకా వాయించుకోండి అన్నాడట’
రఘురామకృష్ణంరాజు మళ్లీమళ్లీ ఏ ఉద్దేశంతో తనను కొట్టారని చెబుతున్నారో తెలియదు. కానీ ఆయన చేష్టలతో కోపోద్రిక్తులైన వారికి మాత్రం …తాజాగా తనపై పోలీసుల దాడికి సంబంధించిన మాటలు తప్పకుండా శ్రవణానందనం కలిగిస్తాయనంలో అనుమానం లేదు. జగన్ ప్రభుత్వంపై రఘురామ ఎన్ని ఆరోపణలు చేసినా…కొత్తగా వచ్చేది, పోయేదేమీ వుండదని తెలుసుకుంటే మంచిది. ఇంకా చెప్పాలంటే రఘురామ పరువే పోతుంది.