నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రూటే సపరేటు. ఆయనేం చెప్పినా సంచలనమే. తన గురించి కూడా ఏమీ దాచుకోరు. అదే ఆయన ప్రత్యేకత. తానెంతగానో ప్రేమించే సొంత పార్టీ, అలాగే అధినాయకుడిపై ప్రేమతో పచ్చి నిజాలు చెబుతానని ఆయన అంటూ ఉంటారు. ప్రేమ ఇచ్చిన వాళ్లకు అదే రీతిలో ప్రేమ దక్కడం ప్రకృతి ధర్మం. తమ శ్రేయస్సు కోరి మంచి మాటలు చెప్పే రఘురామపై సొంత ప్రభుత్వానికి కూడా ఎంతో ప్రేమ. అందుకే ఆయనపై ప్రేమతో ఏపీ సీఐడీ పోలీసులు ఓ శుభముహూర్తాన హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకెళ్లారు.
ఆ తర్వాత ప్రేమతో తన వీపు విమానం మోత మోగించారని, కాళ్లు వాచిపోయేలా లాఠీలతో సత్కరించారని రఘురామ చెప్పుకొచ్చారు. ఎలాంటి నెగెటివిటీని అయినా పాజిటివ్‌గా మలుచుకోవడం రఘురామ గొప్పతనం. అందుకే తనను చితక్కొట్టిన వాళ్లపై కూడా ప్రేమ కనబరుస్తూ, ఒక చెంపపై కొడితే మరో చెంప చూపమన్న గాంధీజీ స్ఫూర్తిని, ఆదర్శాన్ని కనబరుస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకే ఒక్కడిగా నిలిచారాయన.
గుండె విప్పి చెప్పే కార్యక్రమంలో రఘురామ …తన మనసులో మాటను చక్కగా ఆవిష్కరించారు. జైలు ఘటనను ఎంతో నాటకీయంగా కళ్ల ముందు నిలపడాన్ని చూస్తే… సినీ రంగంపై ఆయనకున్న మక్కువ, నటనలో ఆయన నైపుణ్యాన్ని తెలుసుకోవచ్చు.
ఇంటర్వ్యూ చేసిన మీడియా యజమాని, అలాగే పాల్గొన్న ఎంపీ రఘురామ దురుద్దేశాలు ఏంటో తెలుగు సమాజానికి బాగా తెలుసు. జగన్‌ను బద్నాం చేసే ప్రయత్నంలో తాము ఏమవుతున్నామో వాళ్లకు పట్టనట్టుంది. అయినా ఏమన్న కావడానికి వాళ్లకు ఏమున్నాయ్ అని ప్రశ్నించే వాళ్ల సంఖ్య తక్కువేం కాదు. ఈ ఇంటర్వ్యూలో కీలక అంశం…తనను కొడుతుంటే కలిగిన ఫీలింగ్స్‌ను ఆవిష్కరించడం. ఆ ఫీలింగ్స్‌ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
“బాగా కేకలు వేశాను. పాదాల మీద కొడుతుంటే బుర్రలో వెయ్యి ఓల్టుల షాక్ కొట్టినట్లు అయింది” అని ఎంపీ సార్ చెప్పు కొచ్చారు. జగన్‌ను విపరీతంగా ప్రేమించడం వల్ల కాబోలు…. ఘన సత్కారం చేసినట్టున్నారు. ఒక జీవిత కాలానికి సరిపోయేలా రఘురామకు జగన్ తీపి జ్ఞాపకాలు మిగిల్చారని ఈ గుండె విప్పి చెప్పే వరుస ఇంటర్వ్యూల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇలాగే జనానికి వినోదాన్ని రఘురామ పంచుతూ ఉండాలని ఆకాంక్షిద్దాం.