ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.. లో అధ్యక్ష ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరగాలని ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు! పిల్లి మెడలో గంట కట్టెదెవరు? అనే ప్రశ్నకు సమాధానం ఎప్పుడూ ఉండదు. కాంగ్రెస్ లో ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంది.
ఇటు కపిల్ సిబల్ స్పందించగానే, అటు వైపు నుంచి అధిష్టానం దాసుడు అశోక్ గెహ్లాట్ స్పందించాడు. పార్టీ అంతర్గత విషయాలను బయట చర్చించద్దు అని అంటున్నాడు. ఎంతైనా సోనియా, రాహుల్ ల దయతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కావడంతో.. ఆయన వారికి తగ్గట్టుగా స్పందించారు!
పార్టీ జాతీయాధ్యక్ష పదవిని తను చేపట్టకుండా, మరొకరికి దాన్ని దక్కనీయకుండా.. పార్టీని, పార్టీని నమ్ముకున్న వాళ్లపై తీవ్రమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు రాహుల్ గాంధీ. ఉత్తరాదిన రాహుల్ ను జనాలు ఒక విదూషకుడిగా తీసుకుంటూ ఉన్నారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీకి దక్కకూడని ఇమేజ్ అది. తమ పార్టీని తామే నాశనం చేసుకోవడానికి సోనియా, రాహుల్ అవిశ్రాంతంగా పని చేసుకుంటున్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడీవేడీగా సాగుతున్న దశలో రాహుల్ పిక్నిక్ వెళ్లారని, సోదరి ప్రియాంకతో కలిసి విందులు చేసుకున్నారని వస్తున్న వార్తలు.. కాంగ్రెస్ మీద ఇంకా ఎవరికైనా ఆశలుంటే వారిని తీవ్రంగా హర్ట్ చేస్తున్నాయి! .
ఆసక్తి లేనప్పుడు.. రాహుల్ ఇంకా ఎందుకు పార్టీని మరొకరి చేతిలోకి వదలడం లేదు? అనే ప్రశ్నను అడిగే వాడు కాంగ్రెస్ లో లేడు! అదే ఆ పార్టీకి శాపంగా మారింది. ఇప్పుడు కపిల్ సిబల్ పరోక్షంగా ఆ ప్రశ్ననే వేశాడు. అంతటి ప్రసిద్ధ లాయర్ ఈ ప్రశ్న వేసినా.. ఆయన నోరు మూయించడం కాంగ్రెస్ లోని సోనియా, రాహుల్ ల భక్తులకు పెద్ద కష్టం కాదు!
ఇక ప్రియాంక వాద్రా పేరుతో మరో టర్మ్ రాజకీయం చేసేలా ఉన్నారు. అయితే ఆమె కథ ఇప్పటికే తెలిసిపోయింది. ప్రియాంక ఇంకా ప్రత్యక్ష రాజకీయాల వైపు రాలేదు, పార్టీ బాధ్యతలు తీసుకోలేదు, ఆమెను కాంగ్రెస్ ఇంకా పరీక్షించలేదు.. అనేది కూడా ఒట్టి వాదనే! ఆమెతో కూడా కాంగ్రెస్ ను రక్షించడం జరిగే పని కాదు అని స్పష్టం అవుతోంది.
తాతలు స్థాపించిన పార్టీపై, ఎంతో మంది తాతలు పని చేసిన పార్టీపై కాస్తైన గౌరవం ఉంటే.. సోనియా, రాహుల్ గాంధీలు కాంగ్రెస్ ను తమ కబంధ హస్తాల నుంచి వదులుతారు. దాన్ని ప్రజాస్వామ్యయుతం చేసి.. కోలుకునేందుకు అవకాశం ఇస్తారు. అలా చేయకపోతే.. దేశ వ్యాప్తంగా ఓటు బ్యాంకు ఉన్న ఒక పార్టీ అతి త్వరలోనే కనుమరుగయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి!