ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వివాదం వస్తే దానిని పరిష్కరించుకోవడానికి మీటింగ్ పెడితే దానిని పంచాయతీ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనడం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎన్నిసార్లు ఆయనపై విమర్శలు వచ్చినా పులివెందుల పంచాయతీ అని అనడం మానలేదు. గతంలో కడప పంచాయతీ అని, రాయలసీమ రౌడీలు అని వ్యాఖ్యానించడం ఆయనకు అలావాటు అయింది. ఒక ప్రాంతం లేదా కులం ప్రాతిపదికన అందరిని కలిపి అవమానించకూడదన్న కనీస ఇంగితం లేకుండా నలభైరెండేళ్ల సీనియర్ నేత వ్యవహిరస్తున్న తీరు తెలుగుదేశం పార్టీకే కాదు.. తెలుగువారికే అవమానకరంగా మారుతోంది.
చంద్రబాబుకు ఈ అలవాటు ఇప్పటిదికాదు. వ్యక్తులపై బురద చల్లడంలో నిష్ణాతుడుగా పేరొందారు. గతంలో ఎన్టీఆర్కే తప్పలేదు. అంతేకాదు.. విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలా ఒకరేమిటి.. తను టార్గెట్ అనుకున్న వాళ్లందరి మీద ఉన్నవి, లేనివి ప్రచారం చేయించడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అనిచెప్పాలి. తను నాయకత్వం వహించే టీడీపీలో మాత్రం ఆయావర్గాల వారిని పిలిచి ఎన్నోసార్లు రాజీలు చేయడం, లేదా త్రిసభ్య కమిటీలని పెట్టి వారివద్ద చర్చలు జరిపించడం వంటివి ఎన్నో చేశారు. వాటిని సమర్ధించుకుంటారు.
నిజానికి పంచాయతీ అన్న పదానికి చాలా అర్థాలు ఉంటాయి. కొన్ని వివాదాలను సామరస్యంగా పరిష్కరించడం, లేదా బెదిరించి రాజీలు కుదర్చడం. లేదా వాళ్లను డబ్బు పంచుకునేలా ఏర్పాట్లు చేయడం. చంద్రబాబు ఇలాంటి వాటిలో దిట్టగా పేరొందారు. కాకపోతే ఆయన ముందుగా ఎదుటివారిని బదనాం చేసి, తాను మాత్రం ఆ పంచాయతీల ద్వారా లాభపడాలని చూస్తారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ఎన్ని పంచాయతీలు చేశారో తెలియదా? ఆయా జిల్లాలలో నియోజకవర్గాల వారిగా చూస్తే చాంతాడు అంత అవుతుంది.
ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినప్పుడు ఎంత పంచాయతీ చేశారో టీడీపీ వారు మర్చిపోయారా? కర్నూలులో టీజీ వెంకటేశ్, ఎస్వీ మోహన్‌రెడ్డిల మద్య గొడవ నుంచి ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్‌ల వరకు.. ఒకటేమిటి? ఎన్నో ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఒకే పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరితో భేటీ అయితే పంచాయతీ అయితే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకుని, సొంత పార్టీ నేతలతో రాజీలు చేసినప్పుడు ఏమనాలి. రాజకీయ దందా అనాలి. డబ్బులు పంపిణీ అనాలా?
ఈ మాట మనం చెప్పడంకాదు. అప్పట్లో వైసీపీ నుంచి ఫిరాయించిన అప్పటి మంత్రి జమ్మలమడుగు నేత ఆదినారాయణరెడ్డి స్వయంగా చెప్పారు. ఆ వీడియోలు ఇప్పటికీ సర్కులేషన్లోనే ఉన్నాయి. చంద్రబాబు ఐఎఎస్‌లను కూడా కూర్చోబెట్టి రాజీ చేయించారని, నియోజకవర్గంలో పనులను, వచ్చే ఆదాయాన్ని ఫిప్టి, పిప్టి చేసుకోమన్నారని చెప్పారా? లేదా? దానిని పంచాయతీ దందా అంటారు. ప్రజల సొమ్మును అడ్డగోలుగా తమ నేతలను తినండని చెప్పడాన్ని పంచాయతీ అంటారు. అద్దంకిలో ఎమ్మెల్యేగా ఉన్న రవికుమార్ టీడీపీలోకి వచ్చినప్పుడు కరణం బలరాంతో ఎలాంటి ఒప్పందం చేశారు?
రవికుమార్‌కు ఉన్న గ్రానైట్ వ్యాపారానికి ఎలాంటి ఇబ్బంది లేకుండాను, అలాగే కరణం వర్గానికి ఇబ్బంది రాకుండాను రాజీచేయడాన్ని పంచాయతీ అంటారు. కోడుమూరు మాజీ ఎమ్మెల్యే తాను ఎన్ని కోట్లకు అమ్ముడుపోయింది స్వయంగానే చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వో వనజాక్షిపై దౌర్జన్యం చేసినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రంగంలో దిగి చింతమనేనికి అండగా నిలబడి ఆడ కూతురని కూడా చూడకుండా వనజాక్షిని బెదిరించారే.. దానిని పంచాయతీ అంటారు.
రవాణా కమిషనర్‌గా ఉన్న బాల సుబ్రహ్మణ్యాన్ని ఎంపీ కేశినేని నాని, అప్పటి ఎమ్మెల్యే బొండా ఉమ వంటివారు బెదిరించినప్పుడు వారిపై కేసు పెట్టకుండా అధికారులను అడ్డుకున్నారే దానిని పంచాయతీ అంటారు. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్ని ఉదాహరణలు అయినా ఇవ్వవచ్చు. ఇప్పుడు జరిగిందేమిటి? నెల్లూరులో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఒక ప్రాంతానికి నీటి కనెక్షన్ వ్యవహారంపై వివాదపడ్డారు. అయినా ఆయన ఎంపీడీఓ సరళకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తంచేయడం సరికాదు. అది వేరే ఎమ్మెల్యేతో వచ్చిన గొడవ అని అన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా జగన్ ఏమిచేశారు.
కోటంరెడ్డిపై కేసు పెట్టవద్దన్నారా? అరెస్టు చేయవద్దని పోలీసులకు చెప్పారా? పోలీసులు వెంటనే కోటంరెడ్డిని అరెస్టు చేశారే? అయినా టీడీపీకి, చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ వంటివారికి సంతృప్తి కలగలేదు. బెయిల్ ఎలా ఇస్తారని నిసిగ్గుగా ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అసలు అరెస్టు చేయలేదన్న సంగతిని విస్మరించి వైసీపీ ప్రభుత్వంలో సొంత ఎమ్మెల్యేలను అరెస్టు చేయిస్తే అంతవరకు అభినందించవలసిందిపోయి ఏదో ఒక విమర్శ చేసి టీడీపీ నేతలు పరువు పోగొట్టుకుంటున్నారు. చంద్రబాబుకు వేరే సబ్జక్టు దొరక్క ఇలాంటి చిన్న, చిన్న కేసులను కూడా బూతద్ధంలో చూపించి రాజకీయ లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారు.
మాట్లాడితే టీడీపీ కార్యకర్తలపై దాడులని, కేసులని పదే, పదే అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఆ విషయం ఎలా ఉన్నా, టీడీపీ ఎలా కాచుకుని కూర్చున్నది గమనించి వైసీపీ నేతలు కూడా జాగ్రత్తగా ఉండవలసిందే. అందులో సందేహం లేదు. అయితే చంద్రబాబు మాత్రం ప్రాంతం పేరుతో, కులం పేరుతోనో దూషణలకు దిగడం మాత్రం పద్ధతి కాదు. అందుకే వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇలా మరోసారి చంద్రబాబు అవమానిస్తే ఆ ప్రాంత ప్రజలు ఆయన మూతిమీద వాత పెడతారని హెచ్చరించారు.
వాతల వరకు ఎందుకు గాని, ఏ నాయకుడు అయినా పద్ధతిగా మాట్లాడినంత వరకు ఇబ్బంది లేదు. కాని చంద్రబాబు హద్దులు మీరి పంచాయతీ అంటూ విమర్శలు చేయడం మాత్రం దురదృష్టకరం.
-కొమ్మినేని శ్రీనివాసరావు