కరోనా వైరస్ కట్టడికి జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. కేంద్ర మంత్రులు, ఉన్నతాధి కారుల నుంచి ఇప్పటికే జగన్ సర్కార్‌కు అభినందనలు వచ్చాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుం టున్న చర్యలను జాతీయ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఏపీ ప్రభుత్వం రోజువారీ దేశంలోనే అత్యధిక కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. ప్రతిరోజూ 70 వేలకు పైబడి కోవిడ్ పరీక్షలు చేస్తుండడంతో కేసులు కూడా పెరుగుతున్నాయి. కానీ ఎక్కువ పరీక్షలు చేస్తున్న వాస్తవాన్ని తెలుగు మీడియాలో ఓ వర్గం ఉద్దేశ పూర్వకంగా దాస్తూ….కేవలం నమోదవుతున్న కేసుల గురించి హైలెట్ చేస్తూ….ఏపీలో ఘోరం జరిగిపోతోందంటూ గగ్గోలు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ జాతీయ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ స్పందిస్తూ కేసులు పెరుగుతున్నా….ఏపీ సర్కార్ టెస్టులు తగ్గించకపోవడాన్ని అభినందించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీ అనుసరిస్తోన్న విధానం ప్రశంసనీయంగా ఉందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా లెక్కల్ని దాస్తున్నట్టుగా…ఏపీ చేయడం లేదన్నారు.
టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేటింగ్.. ఇవే కరోనా కట్టడికి మార్గాలని ఆయన అన్నారు. జగన్ పరిపాలనపై రాజ్‌దీప్ ఇది రెండో ప్రశంసా పూర్వక ట్వీట్. ఇటీవల ఏపీలో 108, 104 అంబులెన్సు సర్వీసులను పెద్ద ఎత్తున ప్రారంభించన సందర్భంలో కూడా రాజ్‌దీప్ ప్రోత్సాహక ట్వీట్ చేయడం తెలిసిందే. కరోనా లాంటి విపత్కర, క్లిష్ట సమయంలో ఏపీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందంటూ ఆయన ప్రశంసించిన సంగతి తెలిసిందే.