రజనీకాంత్‌.. సాధ్యమయ్యే పనేనా అది.?

ముఖ్యమంత్రి పదవిలో తమ అభిమాన సినీ నటుడు రజనీకాంత్‌ని చూడాలని ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్నారు ‘తలైవా’ అభిమానులు. ‘బాబా’ సినిమా టైవ్‌ులో ఈ చర్చ చాలా జోరుగా సాగింది. అయితే, ఆ తర్వాత చోటు…

ముఖ్యమంత్రి పదవిలో తమ అభిమాన సినీ నటుడు రజనీకాంత్‌ని చూడాలని ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్నారు ‘తలైవా’ అభిమానులు. ‘బాబా’ సినిమా టైవ్‌ులో ఈ చర్చ చాలా జోరుగా సాగింది. అయితే, ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో, రాజకీయాల పట్ల రజనీకాంత్‌ ఆసక్తి చూపలేదు. కానీ, రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా.. అంటూ తాజాగా రజనీకాంత్‌ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా రజనీకాంత్‌ అభిమానుల్లో ‘అలజడి’ బయల్దేరింది.

మామూలుగా అయితే, రజనీకాంత్‌ అభిమానులు సంబరాల్లో మునిగి తేలాలి. కానీ, ఇక్కడ పరిస్థితి వేరు. ఆయన, తనను తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకోకపోవడమే అందుక్కారణం. ‘నేను కింగ్‌ని కాదు.. కింగ్‌ మేకర్‌ని..’ అని ప్రకటించేశారు రజనీకాంత్‌. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇంకెవర్నో కూర్చోబెడ్తానని రజనీకాంత్‌ ప్రకటిస్తే, దాన్ని ఆయన అభిమానులు తట్టుకోగలరా.?

ఈ రోజుల్లో రాజకీయాలు సినీ ప్రముఖులకు అంతగా కలిసి రావడంలేదు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవికీ, జనసేన పార్టీతో రాజకీయాలు చేస్తున్న పవన్‌ కళ్యాణ్‌కీ.. ప్రజా క్షేత్రంలో ఎలాంటి ఫలితాలు ఎదురయ్యాయో చూశాం. తమిళనాట కూడా విజయ్‌కాంత్‌ తదితరులు రాజకీయంగా చేదు అనుభవాల్ని ఎదుర్కొన్నారు. ‘వాళ్ళంతా వేరు.. నేను వేరు..’ అని రజనీకాంత్‌ పైకి చెప్పొచ్చుగాక.. కానీ, గ్రౌండ్‌ రియాల్టీ ఏంటో ఆయనకు తెలియకుండా వుంటుందా.?

అందుకే, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం నుంచి లైట్‌ తీసుకున్నారు రజనీకాంత్‌. అయితే, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం వుంది. ఈలోగా అభిమానుల యాగీ ఓ రేంజ్‌లో జరగబోతోంది. రజనీకాంత్‌ ఎవర్ని సీఎం అభ్యర్థిగా నిలబెట్టినా, అతని అభిమానులే వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది. అప్పుడెలాగూ అభిమానుల కోరిక మేరకు నిర్ణయం తీసుకోక తప్పదు.

అన్నట్టు, తమిళనాడులో ‘లోకల్‌ సెంటిమెంట్‌’కి పవర్‌ చాలా చాలా ఎక్కువ. రజనీకాంత్‌ మీద ‘స్థానికేతరుడు’ అన్న ముద్ర వుండనే వుంది. శరత్‌కుమార్‌ లాంటోళ్ళు రజనీకాంత్‌పై ఈ దిశగా ఎన్నో ఆరోపణలు చేశారు ఎన్నో సందర్భాల్లో. సో, అందుకే.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రజనీకాంత్‌ తన రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేస్తూ, సీఎం అభ్యర్థిపై షాకింగ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడని అర్థం చేసుకోవాలేమో.!

మేన‌ల్లుడి చిత్ర ప్రారంభోత్స‌వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్

ఆది సోదరులూ వైసీపీలోకే