లెక్కప్రకారం 6వ తేదీన ఈడీ విచారణకు హాజరవ్వాలి రకుల్ ప్రీత్ సింగ్. కానీ ఆ రోజున తను హాజరుకాలేనని, షూటింగ్స్, ఇతర పనులతో బిజీగా ఉన్నానని ఈడీకి సమాచారం ఇచ్చింది ఈ హీరోయిన్. దీంతో ఈడీ అధికారులు ఆమెను ఈరోజే ప్రశ్నించడానికి రంగం సిద్దంచేశారు. ప్రస్తుతం ఈడీ అధికారులు, రకుల్ ను విచారిస్తున్నారు.
6వ తేదీ విచారణకు హాజరుకాలేనని తెలిపిన రకుల్.. ఈరోజే విచారణకు వస్తానని మెయిల్ ద్వారా అధికారులకుక సమాచారం ఇచ్చింది. చెప్పినట్టుగానే చేతిలో ఫైల్ పట్టుకొని, తన మేనేజర్, లాయర్, చార్టడ్ ఎకౌంటెంట్ తో విచారణకు హాజరైంది. ఈడీ అధికారులు 10.30కి ఆఫీస్ కు రమ్మంటే, రకుల్ 9 గంటల 10 నిమిషాలకే కార్యాలయానికి చేరుకుంది.
డ్రగ్స్ కేసులో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలువురు సినీప్రముఖుల్ని విచారిస్తోంది ఈడీ. ఇందులో భాగంగా పూరి జగన్నాధ్ ను 10 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన అధికారులు, నిన్న చార్మిని 8 గంటల పాటు ప్రశ్నించారు. ప్రస్తుతం రకుల్ ను విచారిస్తున్నారు.
డ్రగ్స్ కేసుకు సంబంధించి రకుల్ ను ఈడీ ప్రశ్నించడం ఇదే తొలిసారి కాదు. గతంలో బాలీవుడ్ హీరో సుశాంత్ మరణానికి సంబంధించి బహిర్గతమైన డ్రగ్స్ కేసులో కూడా రకుల్ ను ఈడీ ప్రశ్నించింది. ఇప్పుడు టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆమె విచారణ ఎదుర్కొంటోంది. ఈడీ అడిగిన అన్ని బ్యాంక్ స్టేట్ మెంట్లను సమర్పించబోతోంది.
ఇక ఈ కేసుకు సంబంధించి 8వే తేదీన రానా, 9వ తేదీన రవితేజ విచారణకు హాజరుకాబోతున్నారు. వాళ్ల ఖాతాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని కూడా ఇప్పటికే సేకరించింది ఈడీ.