అద్దెకు రామోజీ ఫిలింసిటీ?

మీడియా టైకూన్ రామోజీరావు ఏ స్థాయి ఆర్థిక కష్టాల్లో ఉన్నారో చెప్పడానికి ఇదొక్కటి చాలు. అవును.. ఫిలింసిటీని అద్దెకు ఇవ్వడానికి రామోజీ రావు సూచనప్రాయంగా అంగీకరించారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి ఆయనకు ఇంతకుమించిన…

మీడియా టైకూన్ రామోజీరావు ఏ స్థాయి ఆర్థిక కష్టాల్లో ఉన్నారో చెప్పడానికి ఇదొక్కటి చాలు. అవును.. ఫిలింసిటీని అద్దెకు ఇవ్వడానికి రామోజీ రావు సూచనప్రాయంగా అంగీకరించారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి ఆయనకు ఇంతకుమించిన మార్గం కనిపించలేదు.

డిస్నీ హాట్ స్టార్ సంస్థ రామోజీ ఫిలింసిటీని మూడేళ్ల పాటు అద్దెకు తీసుకోబోతోంది. ఈ మేరకు చర్చలు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. అగ్రిమెంట్ కనుక పూర్తయితే, ఫిలింసిటీపై రామోజీరావు మూడేళ్ల పాటు తన ఆధిపత్యాన్ని కోల్పోతారు.

రామోజీ గ్రూప్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉంది. మార్గదర్శి చిట్ ఫంట్స్ మినహాయిస్తే, మిగతా అన్ని సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయి. చివరికి బంగారు బాతుగుడ్డు లాంటి “ఈనాడు” కూడా ఆర్థిక సమస్యల్లో పడింది. గ్రూప్ లోని దాదాపు ప్రతి సంస్థలో ఉద్యోగులపై వేటు వేశారు రామోజీ. ఈనాడులో ఎన్ని ఉద్యోగాలు పోయాయో అందరికీ తెలిసిందే. దీంతో పాటు ఈటీవీ ఛానెల్స్, ప్రియా ఫుడ్స్, కళాంజలి, తార-సితార హోటల్స్ లాంటి సంస్థల్లో కూడా చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.

షూటింగ్స్, పర్యాటకులు లేకపోవడంతో రామోజీ ఫిలింసిటీ సిబ్బంది కూడా దాదాపు 60శాతం మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఫిలింసిటీని మూడేళ్ల పాటు లీజుకు ఇవ్వడానికి రామోజీ రావు అంగీకరించినట్టు తెలుస్తోంది. డీల్ ఓకే అయితే గ్రూప్ దాదాపు 60శాతం నష్టాల నుంచి బయటపడుతుందట.

ఫిలింసిటీని తన ఒరిజినల్ కంటెంట్ షూటింగ్స్ కోసం వాడుకోవాలని డిస్నీ భావిస్తోందట. వెబ్ సిరీస్ లతో పాటు ఇతర షూటింగ్ అవసరాల కోసం ఫిలింసిటీని పూర్తిస్థాయిలో వాడుకోవాలని ఆ సంస్థ అనుకుంటోంది. అయితే అదే ఫిలింసిటీలో ఈనాడు-ఈటీవీ సంస్థలున్నాయి. రామోజీ గ్రూప్ హెడ్ ఆఫీస్ ఉంది. వీటికి తోడు ఆయన నివశించే విలాసవంతమైన భవనం (ఒక చిన్న కొండపై కట్టిన సువిశాలమైన ప్యాలెస్) కూడా ఫిలింసిటీలోనే ఉంది. వీటిపై ఎలాంటి ఒప్పందాలకు వచ్చారనేది తెలియాల్సి ఉంది.

దీంతో పాటు ఇతర సినిమాల షూటింగ్స్ కు ఫిలింసిటీని ఇస్తారా.. పర్యాటకుల్ని అనుమతిస్తారా లాంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. మొత్తమ్మీద తన కలల సౌధం ఫిలింసిటీని లీజుకు ఇవ్వాలనే నిర్ణయానికి మాత్రం రామోజీరావు వచ్చినట్టు ఫిలింసిటీ వర్గాలు చెబుతున్నాయి.

పీకే ఓడిపోయింది మాఊరి నుంచే