జనసేన పార్టీ పరువు నిలబెడుతూ ఒకే ఒక్క ఎమ్మెల్యే విజేతగా నిలిచి అసెంబ్లీకెళ్లారు. గెలిచారన్న మాటే కానీ, పార్టీలో అతనికి ప్రామఖ్యత లేదు, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దగ్గర కూడా పెద్దగా విలువ లేదు. ఆ మధ్య ప్రకటించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఏకైక ఎమ్మెల్యే పేరు లేకపోవడమే దీనికి నిదర్శనం. అసలు రాపాకను జనసేన తమ ఎమ్మెల్యేగా గుర్తించడమే లేదు. పవన్ కల్యాణ్ కూడా ఆ నలుగురిని వెంటేసుకుని తిరుగుతారు కానీ, ఏనాడూ ఎమ్మెల్యేని పక్కనపెట్టుకుని కనపడిందీ లేదు.
దీంతో పవన్ తో సహా పార్టీలోని ఇతర కీలక నేతలకు కూడా రాపాక అంటే అలుసైపోయిందట. ఇటీవల జరిగిన పార్టీ మీటింగ్ లో పవన్ కల్యాణ్ పక్కనుండగానే నాదెండ్ల మనోహర్ రాపాకపై నోరు చేసుకున్నారు. ఆలస్యంగా వచ్చినందుకు సంజాయిషీ ఇస్తుండగానే మిమ్మల్ని బొట్టు పెట్టి పిలవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచీ రాపాక వర్గం మరింత అసంతృప్తికి లోనయింది. గెలిచే దమ్ములేని వారంతా గెలిచిన ఎమ్మెల్యేపై అక్కసు వెళ్లగక్కుతున్నారంటూ రాపాక వర్గం సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారానికి తెరతీసింది. అసలు సిసలు జనసైనికులు కూడా వీరికి మద్దతుగా నిలిచారు.
జనసేనలో రాపాక రచ్చ ఇప్పటిది కాదు. బడ్జెట్ సమావేశాల్లో రాపాక వరప్రసాద్ భగవద్గీత అంటూ జగన్ తొలి పద్దుని ఆకాశానికెత్తేసినప్పటి నుంచి పార్టీలో ఆయన వ్యవహారం చర్చకు వస్తూనే ఉంది. ఇక ఇటీవల జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడంతో ఇది మరింత ముదిరింది. ఇన్ని చేస్తున్నా తానింకా జనసేనకు విధేయుడినేనని ప్రకటించుకుంటారు రాపాక. పవన్ కల్యాణ్ అంటే తనకు భక్తి, గౌరవం అంటారు. అందుకే ఆయన విషయంలో అటు పార్టీ కూడా ఏమీ చేయలేకపోతోంది. క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు, అలాగని చూస్తూ వదిలేయలేదు.
మొత్తమ్మీద రోజులు గడిచేకొద్దీ జనసేనాని పవన్ కు రాపాక కొరకరాని కొయ్యగా మారే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు వైసీపీలోకి వెళ్లక, ఇటు జనసేనలోనే ఉంటూ ఆ పార్టీ పరువు తీయడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు రాపాక. రాబోయే రోజుల్లో ఈ రచ్చ ఏ రేంజ్ కు చేరుతుందో చూడాలి.