మడమ తిప్పని జగన్ కు అసలైన పరీక్ష ఇది

శాసన మండలి రద్దు చేయాలని జగన్ మనసులో ఉన్నట్టు జనాలకి అర్థమైంది. అసెంబ్లీ సాక్షిగా జగన్ తన మనసులోని మాట బైటపెట్టారు, మంత్రుల చేత కూడా చర్చకు వచ్చేలా చేశారు. మండలిని ఎందుకు రద్దుచేయాలనే…

శాసన మండలి రద్దు చేయాలని జగన్ మనసులో ఉన్నట్టు జనాలకి అర్థమైంది. అసెంబ్లీ సాక్షిగా జగన్ తన మనసులోని మాట బైటపెట్టారు, మంత్రుల చేత కూడా చర్చకు వచ్చేలా చేశారు. మండలిని ఎందుకు రద్దుచేయాలనే విషయంపై కారణాలు కూడా వివరించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టే ముఖ్యమైన బిల్లులకు మోకాలడ్డడం, మేథావులుండాల్సిన సభ, రాజకీయ నిరుద్యోగుల శరణాలయంగా మారడం, వృథా ఖర్చు.. ఈ మూడూ ప్రధానంగా చర్చకు వచ్చాయి. 

దాదాపుగా జగన్ మండలిని రద్దు చేసేందుకు సిద్ధమయ్యారని ఈమేరకు 27న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుని, దాన్ని అదే రోజు అసెంబ్లీలో ఆమోదించి, పార్లమెంట్ కి ప్రతిపాదన పంపించాలని అంటున్నారు. అయితే మరోవైపు జగన్ పునరాలోచిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. పార్టీ టికెట్లు దక్కనివారిని, పార్టీకి అవసరమైన వారిని సర్దుబాటు చేయాలంటే మండలి అవసరం. అందులోనూ ప్రస్తుతం జగన్ కేబినెట్ లో ఇద్దరు మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

కౌన్సిల్ రద్దయితే వీరిద్దరి పదవీకాలం ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చి తిరిగి మరో ఆరు నెలల పాటు మంత్రులుగా కొనసాగవచ్చు కానీ, అది సరైన పద్ధతి కాదు. కచ్చితంగా పోర్ట్ ఫోలియోలు మార్చాల్సిన పరిస్థితి. అయితే మండలిలో టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు, ఇతరులు తమతో కలిసొస్తే.. రద్దు విషయంలో పునరాలోచిస్తామంటూ కొందరు వైసీపీ నేతలే అంటున్నారు. ఇటీవలే జగన్ ని కలసిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఇదే విషయాన్ని బహిరంగంగా చెప్పారు. 

అంటే.. జగన్ ని శరణు కోరితే మీ ఎమ్మెల్సీ పదవులకు ఢోకా లేదు, ప్రతిపక్షాన్ని పట్టుకుని ఊగులాడితే మండలిని శాశ్వతంగా రద్దు చేస్తారని బెదిరిస్తున్నారన్నమాట. అయితే జగన్ ఈ విషయంపై ఎక్కడా పెదవి విప్పలేదు కాబట్టి, ఆయన మనసులో ఇలాంటి దూరాలోచన ఉంటుందని అనుకోలేం. ఒకవేళ ఎవరైనా ఈ ప్రత్యామ్నాయాన్ని చూపించి, జగన్ ని ఒప్పిస్తే మాత్రం ఆయనకి చెడ్డపేరు రావడం ఖాయం. 

మండలిని కొనసాగిస్తామని జగన్ చెబితే అప్పుడు 60కోట్ల రూపాయల అదనపు ఖర్చు లెక్కలో నుంచి ఎగిరిపోయినట్టేనా. దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో మండలి లేదని చెప్పిన జగన్, తమ రాష్ట్రంలో ఏ కారణంచేత మండలిని కొనసాగించాలనుకుంటున్నారో ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసెంబ్లీలో మండలిపై అన్ని ఆరోపణలు చేసి ఇప్పుడు వెనక్కి తగ్గితే జనం ఏమనుకుంటారు. అయిందేదో అయిపోయింది. మండలిపై ప్రజల్లో కూడా పెద్ద ఆసక్తి లేదు, వారికి ఆ అవసరమూ లేదు. అలాంటప్పుడు ఒకడుగు ముందుకేసిన జగన్.. ఇక ముందుకు వెళ్లడమే పార్టీకి మంచిది. 

పొరపాటున రాజకీయ లబ్ధి కోసం వెనక్కు తగ్గారా.. కచ్చితంగా జనంలో పలుచన కావాల్సి ఉంటుంది. పార్టీ మారాలనుకుంటే కచ్చితంగా పదవులకు రాజీనామాలు చేసి రావాలని కండిషన్ పెట్టిన జగన్.. మండలిలో సభ్యుల్ని తమవైపు తిప్పుకోడానికి ఒక మెట్టు కూడా దిగాల్సిన అవసరం లేదు. జగన్ ఎప్పటికీ మడమ తిప్పని నాయకుడిగానే ఉండాలి.

వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలి