గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నమోదైన కరోనా కేసుల కన్నా రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. భారీ స్థాయిలో కరోనా టెస్టులతో ఆంధ్రప్రదేశ్ ముందు వరసలో కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కూడా దేశంలో అత్యధిక పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా నిలుస్తోంది ఏపీ. కరోనా నిర్ధారణ అయిన వారితో కాంటాక్ట్ అయిన వారికి పరీక్షలను తప్పనిసరిగా నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలుస్తూ ఉంది. చాలా రాష్ట్రాల్లో పరీక్షల్లో ఇలాంటి శ్రద్ధ ఏమీ కనిపించడం లేదని తెలుస్తోంది.
ఎక్కువ టెస్టులు జరుగుతున్న ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ఎక్కువగానే నమోదవుతూ ఉంది. గత 24 గంటల్లో 9024 కొత్త కేసులు నమోదు కాగా, ఇదే సమయంలో 9113 మంది కరోనా నుంచి రికవర్ అయ్యి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా కొత్త కేసుల సంఖ్య కన్నా రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదైంది.
ఏపీలో టెస్టింగ్, ట్రేసింగ్ గట్టిగా జరుగుతోందని.. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కరోనా కచ్చితంగా నియంత్రణలోకి వస్తుందని వైద్య పరిశోధకులు అంచనా వేస్తూ ఉన్నారు.
ఇక దేశంలో గత 24 గంటల్లో 60,963 కేసులు నమోదు కాగా, 56,110 మంది కరోనా నుంచి రికవర్ అయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. గత కొన్ని రోజులుగా దేశంలో దినవారీగా ఐదు వేల నుంచి తొమ్మిది వేల వరకూ యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది.