ఒకవైపు ఇండియాలో కరోనా కల్లోలం కొనసాగుతూ ఉంది. మరో రోజు నాలుగు లక్షలకు పైగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. అయితే గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఇదే రోజులో దాదాపు మూడు లక్షలా ఎనభై ఆరు వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా కలిసి యాక్టివ్ కేసుల లోడ్ 15వేల స్థాయిలో మాత్రమే పెరిగింది.
నిజమే కరోనా సోకిన వారిలో కొందరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల వ్యవధిలోనే వారి ఆరోగ్య పరిస్థితి విషమిస్తోంది. గత కొన్నాళ్లుగా దేశంలో ప్రతి రోజూ మూడు వేల నుంచి నాలుగు వేల మంది వరకూ కరోనా కారణంగా మరణిస్తున్నారు. కరోనాకు సంబంధించి ఇది చీకటి కోణం. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కరోనా సోకితే వారి వయసుతో నిమిత్తం లేకుండా కుదిపేస్తోంది. కొందరు యుక్త వయసులోని వారు కూడా కరోనా సోకడం వల్ల మరణించిన దాఖలాలున్నాయి.
ఇదంతా విషాదకరమైన అంశమే. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ మధ్యతరగతి కుటుంబీకులు వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు. పేద వారు ప్రభుత్వ వైద్యాన్ని నమ్ముకుంటున్నారు. ఒక మల్టిస్పెషాలిటీ ఆసుపత్రుల పాలైన వారు లక్షలకు లక్షల రూపాయలు కూడా పెట్టుకుంటున్నారు. ఉన్న వారు ఖర్చు పెట్టుకుంటుంటే, మధ్యతరగతి కుటుంబీకులు అలాంటి ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలవుతున్నారు. ఇలాంటి బాధితుల సంఖ్య అనునిత్యం భారీగా ఉంటోంది. ఇది కరోనాకు సంబంధించి విచారకమైన అంశం.
ఇక ఇదే సమయంలో.. ఇప్పటికీ ఇండియాలో రికవరీ రేటు బ్రహ్మాండంగా ఉంది. కరోనాకు గురైన అనేక మంది హోం ఐసొలేషన్ లోనే ఉంటూ కోలుకుంటూ ఉన్నారు. వీరి శాతం 80కి పైనే ఉంది. గమనించాల్సిన కీలకమైన అంశాలు ఏమిటంటే.. కరోనాకు ఇప్పుడు మండల స్థాయిల్లోనే చికిత్స చేస్తున్నారు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు. ఏపీలో అయితే గ్రామ సచివాలయాల వద్దే కరోనా పరీక్షలు జరుగుతున్నాయి.
టెస్టు రిజల్ట్స్ మెసేజ్ ల రూపంలో అందుతున్నాయి. ఇక పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారు తమకు తోచినట్టుగా ప్రభుత్వ లేదా ప్రైవేట్ వైద్యులతో చికిత్స చేయించుకుంటున్నారు. మండల కేంద్రాల్లో కూడా ఔట్ పేషెంట్లకు చికిత్సను అందిస్తున్నారు ప్రైవేట్ వైద్యులు. వారి కన్సల్టెన్సీ ఫీజు వంద నుంచి రెండు వందల వరకూ ఉంటోంది. ఇక కరోనా సోకిన వారికి రాస్తున్న మందుల ధర మూడు వందల రూపాయల నుంచి, కొందరు వెయ్యి రూపాయల స్థాయి వరకూ రాస్తున్నారు.
కరోనా సోకిన వారు ప్రధానంగా ఖర్చు పెట్టుకోవాల్సింది పోషకాహారం మీద మాత్రమే. పళ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి కొనుక్కొని తినే శక్తి గ్రామీణుల్లో అందరికీ లేకపోవచ్చు. అయితే ప్రాణం మీదకు వచ్చే జబ్బు కాబట్టి.. కష్టమోనష్టమో కొనుక్కొని తినాల్సిందే. అయితే కొందరు సహజమైన వ్యాధి నిరోధకతతోనే కరోనాను జయిస్తున్నారు. గ్రామాల్లోకి ఇప్పుడు కరోనా పాకిపోయింది.
ఇలాంటి నేపథ్యంలో.. ఎండకూ, గాలికీ పని చేసే గ్రామీణ భారతీయుల్లో వ్యాధినిరోధకత ముందు కరోనా ఓడిపోతోంది. కరోనాసోకిన గ్రామీణులను పరిశీలిస్తే.. చాలా తక్కువ మంది మాత్రమే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వయసు 70 దాటిన వారికి మాత్రం గ్రామీణుల్లో కూడా కొందరికి ఇది ప్రమాదకరంగా మారుతోంది. మిగతా వారికి ఉండే ఇమ్యూనిటీ ముందు కరోనా ఓడిపోకతప్పడం లేదు.
ఇక అంతర్జాతీయ గణాంకాలను పరిశీలించినా.. స్థూలంగా భారతీయులను కరోనా ప్రభావితం చేస్తున్న శాతం తక్కువే! గొప్ప వైద్య సౌకర్యాలు, చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండే అమెరికాలో ఇప్పటి వరకూ సుమారు మూడు కోట్లా ముప్పై నాలుగు లక్షలకు మందికిపైగా కరోనా సోకింది. వారిలో మరణించిన వారి సంఖ్య సుమారు 5 లక్షలా 95 వేల వరకూ ఉందని వరల్డో మీటర్ గణాంకాలు చెబుతున్నాయి. అదే ఇండియాలో ఇప్పటి వరకూ సుమారు రెండు కోట్లా 22 లక్షల మందికి పైగా కరోనా సోకగా వారిలో రెండు లక్షలా నలభై రెండు వేల మంది వరకూ మరణించారు.
మంచి వైద్య సౌకర్యాలున్న అమెరికాతో పోల్చి చూసినా, అంతంత మాత్రపు వైద్య సౌకర్యాలుండే మన దేశంలో కరోనా సోకిన వారిలో మరణాల శాతం తక్కువగా ఉంది. అయితే గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే.. ఒకవేళ ఇండియాలో మరింత మెరుగైన స్థాయిలో వైద్య సౌకర్యాలు ఉండి ఉంటే, అత్యవసర పేషెంట్లకు బెడ్లు, ఆక్సిజన్, ఐసీయూ వంటి సదుపాయాలు వందకు వందమందికీ దొరికే పరిస్థితి ఉంటే.. మరణాల రేటు ఈ స్థాయిలో కూడా ఉండేది కాదు!
ప్రాణం మీదకు వచ్చిన వారికి కొందరికి ఆక్సిజన్, ఐసీయూ వంటి సదుపాయాలు లేకే ప్రాణాలు కోల్పోతూ ఉండవచ్చు. వారికి కూడా మెరుగైన వైద్య సదుపాయాలు అందించే పరిస్థితి ఉంటే.. కరోనా కారణ మరణాలు ఇండియాలో మరింత తక్కువగా నమోదయ్యేవి. సహజమైన ఇమ్యూనిటీతోనే నూటికి 90 మందిపైగా కరోనాను జయిస్తున్న దేశంలో మిగతా వారికి సరైన వైద్య సదుపాయాలు అందే పరిస్థితి ఉంటే కరోనా కారణ మరణాల శాతం ప్రపంచంలోనే అత్యంత తక్కువగా నమోదయ్యేదనేది వాస్తవం.