కరోనా -లాక్ డౌన్ ల వేళ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఏర్పడుతోందనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్న సమయంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మాత్రం భారీ ఒప్పందాలతో వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే ముఖేష్ అంబానీ గ్రూప్ లో భాగమైన జియోకు సంబంధించిన వాటాల అమ్మకం భారీ నంబర్లను నమోదు చేసింది. అప్పులన్నీ తీర్చేయడానికి జియో లో అంబానీ వాటాలను అమ్ముతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అలా వాటాల అమ్మకం ద్వారా వేల కోట్ల రూపాయలను సమీకరించినట్టుగా కథనాలు వచ్చాయి. అలా అమ్మకాలే కాదు, మరోవైపు అంబానీ భారీ కొనుగోలు కూడా చేస్తున్నారు.
ఇండియాలో భారీ రీటైల్ మార్కెట్ ను కలిగి ఉన్న ఫ్యూచర్ గ్రూప్ ను ముఖేష్ అంబానీ పూర్తిగా సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా గత కొంతకాలంగా కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ డీల్ ఫైనల్ అయ్యిందని ఆర్థిక వ్యవహారాల సమాచారాన్ని ఇచ్చే పత్రికలు పేర్కొంటున్నాయి. ఆ డీల్ విలువ 24 వేల నుంచి 27 వేల కోట్ల రూపాయల మధ్యలో ఉంటుందని అవి చెబుతున్నాయి. ఈ డీల్ దాదాపు ఖరారు అయినట్టుగా పేర్కొంటున్నాయి.
దేశీయంగా భారీ రీటైల్ మార్కెట్ పితామహుడని పేరు కిషోర్ బియానీకి. ఆయనకు సంబంధించినదే ఫ్యూచర్ గ్రూప్. ఇప్పుడు బియానీ-అంబానీ మధ్యన చర్చలు ఆశావహంగా సాగుతున్నాయని, దాదాపు డీల్ ఓకే అయినట్టుగా సమాచారం. కరోనా లాక్ డౌన్ ల ఫలితంగా రీటెయిల్ షాపుల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. మాల్స్ లో ఉండే ఈ స్టోర్స్ కు వెళ్లడానికి ప్రజలు కూడా సాహసించని పరిస్థితి. అయితే రీటెయిల్ స్టోర్స్ వాళ్లు కూడా తమ తమ యాప్స్ ద్వారా హోం డెలివరీ చేస్తూ తమ మార్కెట్ ను ఎంతో కొంత కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి.
ఇలా రీటెయిల్ మార్కెట్ జోరు కొంత తగ్గి, ఆన్ లైన్ మార్కెట్ విస్తృతి ఇప్పుడిప్పుడు బాగా పెరుగుతూ ఉంది. అయినా.. ఫ్యూచర్ గ్రూప్ కు ఉన్న విస్తృతి దృష్ట్యా దాని విలువ భారీగానే ఉంటుందని మీడియా వర్గాలు విశ్లేషిస్తూ ఉన్నాయి. ఈ డీల్ ద్వారా రిలయన్స్ భారీ స్థాయిలో రీటెయిల్ మార్కెట్ లోకి ఎంటరయినట్టుగా అవుతుందని చెబుతున్నాయి. ఇప్పటికే రీటెయిల్ మార్కెట్ లోకి రిలయన్స్ ఎంటరయ్యింది, ఫ్యూచర్ గ్రూప్ డీల్ ద్వారా రీటెయిల్ మార్కెట్ లో పెద్ద శక్తిగా మారుతోంది.