మనం చాలా అభివృద్ధి చెందుతున్నామని, మన ఆలోచనలు చాలా ఆధునికంగా ఉన్నాయని అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని విషయాల్లో అది నిజం కాదు. ఒకప్పటి ఫ్యాషన్లే మళ్ళీ కొత్తగా వస్తున్నాయని కొందరు చెబుతుంటారు. పూర్వ కాలంలో ఉన్న డ్రస్సులే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. అంటే ఫ్యాషన్ కావొచ్చు, ఆలోచనా విధానం కావొచ్చు రిపీట్ అవుతుంటాయన్న మాట.
ఒకప్పుడు సమాజంలో కులాల ఆధిపత్యం బాగా ఉండేది అన్న సంగతి తెలిసిందే. ఒక కులం వారిని మరో కులంవారు అణగదొక్కడం, దాని ద్వారా గొడవలు, ఘర్షణలు జరగడం చరిత్రలో చూసాం. కులాంతర వివాహాలను సమాజంలో తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికీ ఆ జాడ్యం కనబడుతున్నా దాని తీవ్రత తగ్గింది.
కొన్ని విషయాల్లో కులం పట్టింపులు అంతగా లేవు. ఒకప్పటి రాజకీయ నాయకులు, అభ్యుదయ భావాలు ఉన్నవారు కుల రహిత సమాజం అంటూ తాపత్రయ పడ్డారు. కొందరు ప్రముఖులు కులాల వెనుక తోకలు కత్తిరించిపారేశారు. అంటే కులాన్ని సూచించే పదాలు లేదా పేర్లు ఉండకూడదని అనుకున్నారు.
ఉదాహరణకు …కమ్యూనిస్టు దిగ్గజం పుచ్చలపల్లి సుందరయ్య అసలు పేరు సుందరరామి రెడ్డి. కానీ కులాన్ని సూచించే రెడ్డి పదాన్ని తొలగించుకొని సుందరయ్య అయ్యారు. పాత కాలంలో ఇలాంటి వారు చాలామంది కనబడతారు. ఎంతోమంది కులాంతర వివాహాలను ఉద్యమంలా నిర్వహించారు. ఇంతచేసినా సమాజంలో కులాలు సమసిపోలేదు. కులరహితమైన సమాజం రాలేదు.
ఇప్పుడు కాలం మళ్ళీ మారింది. కాదు …మనుషులు మారారు. మళ్ళీ కులాల ఆధిపత్యం పెరుగుతోంది. ప్రతి కులం వారు వారి కులాన్ని తెలియచేసే తోకలు పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు కులం పేరు మాట్లాడితే తప్పుగా భావించేవారు. మీదే కులం అని అడిగితే అనాగరికుల్లా చూసేవారు. కానీ ఇప్పుడు తమది ఫలానా కులం అని చెప్పుకోవడం గొప్పతనంగా భావిస్తున్నారు.
కులాల సభలు పెట్టుకుంటున్నారు. ఆ సభల్లో తమ కులం ఎంత గొప్పదో గర్వంగా చెబుతున్నారు. ఇంత సుదీర్ఘంగా చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే …తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి తమ రెడ్డి కులం గొప్పదనం గురించి చెప్పారు.
కొందరు భయపడి తమ పేరు చివర రెడ్డి అని పెట్టుకోవడం లేదని, మనం ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, కాబట్టి రెడ్లు తమ పేరు వెనుక రెడ్డి అని తప్పక పెట్టుకోవాలని హితబోధ చేశారు స్పీకర్. ఊళ్ళో పదిమంది రెడ్లు ఉంటే వెయ్యిమందికి సహాయం చేస్తారట. పేదలను ఆదుకుంటారనే ఉద్దేశంతోనే ప్రజలు ఎన్నికల్లో రెడ్లను ఎన్నుకుంటున్నారని సెలవిచ్చారు పోచారం శ్రీనివాస రెడ్డి.
రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో రెడ్లు ఎంత గొప్పవారో వివరించారు పోచారం. కులాల గొప్పదనం గురించి ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్న మనం కులరహిత సమాజం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం, అమాయకంగా ఆలోచించడం అవసరమా ?