మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ‘రుణాన్ని’ ‘రాయిటర్స్’ వార్తా సంస్థ ఎట్టకేలకు తీర్చుకొంది. చంద్రబాబు తన పాలనలో భారీ మొత్తంలో తనకిష్టమైన మీడియా సంస్థలకు దోచి పెట్టిన విషయం బహిరంగ రహస్యమే. ఇంతకాలం కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని ఎల్లో మీడియాకు మాత్రమే దోచి పెట్టారనుకున్న జనం, నిన్న రాయిటర్స్‌లో కియాపై దుష్ప్రచార కథనం వచ్చిన తర్వాత…అసలు విషయం తెలిసి అవాక్కవుతున్నారు.
అక్షరానికి అవినీతి రుచి చూపిన చంద్రబాబు… ప్రత్యర్థులపై తనకు అవసరమైన సమయంలో దురుద్దేశ పూరిత వార్తా కథనాలను కుమ్మరించడానికి ఏ రోజూ వెనుకాడలేదు. కియా మోటార్స్ రాష్ట్రం నుంచి తరలిపోతోందనే దుష్ప్రచారం వెనుక అసలు కథ వెలుగు చూసింది. చంద్రబాబు పాలనలో ఆర్థిక ప్రయోజనాలు పొందిన రాయిటర్స్ సంస్థ…ఇప్పుడాయన రుణాన్ని తీర్చుకునే పనిలో పడింది.
‘డిజిటల్ డెవలప్‌మెంట్’ కార్యక్రమం కింద థామ్సన్ రాయిటర్స్ సంస్థకు భారీ ఆర్థిక ప్రయోజనం కల్పిస్తూ 2017లో రాష్ట్ర ఐటీ శాఖ రెండు ఒప్పందాలు చేసుకుంది. విశాఖలోని గీతం వర్సిటీ ఇందుకు మధ్యవర్తిగా వ్యవహరించింది. ఈ వర్సిటీ బాలకృష్ణ వియ్యంకుడిదని జగమెరిగిన సత్యం. అంతేకాదు నాడు ఐటీశాఖ మంత్రి లోకేశ్ కావడం గమనార్హం. రాష్ట్ర ఐటీ శాఖ, గీతం వర్సిటీ, రాయిటర్స్ సంస్థ సంయుక్తంగా నెలకొల్పిన ‘ఇన్నోవేషన్ యాప్ స్టూడియో’ను 2017 అక్టోబరు 9న అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించాడు.
అకడమిక్, స్టార్టప్, పరిశోధనలకు ప్రోత్సాహం పేరుతో ఈ స్టూడియోను నెలకొల్పారు. దీన్ని ప్రైవేట్ విద్యా సంస్థ అయిన గీతం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయడం గమనార్హం. రాయిటర్స్ దోపిడీ అంతటితో ఆగలేదు. ‘ఇ–ప్రగతి’ కింద కూడా చంద్రబాబు ప్రభుత్వం రాయిటర్స్ వార్తా సంస్థకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా మరో ఒప్పందం చేసుకుంది. ‘డిజిటల్ కంటెంట్ ఎక్ఛేంజ్’ పేరిట ఈ ఒప్పందం చేసుకున్నారు.
ఇ–బుక్ సాఫ్ట్‌వేర్, లీగల్ రిసెర్చ్ సొల్యూషన్స్, వెస్ట్‌లా తదితర మెటీరియల్‌ను ప్రభుత్వ విభాగాలు, విద్యా సంస్థలు రాయిటర్స్ సంస్థ నుంచి వినియోగించుకుంటాయి. సాఫ్ట్‌వేర్ వినియోగానికి టెండర్లు పిలిస్తే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీ పడేవి. కానీ గత ప్రభుత్వం కేవలం రాయిటర్స్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం, ప్రస్తుతం ఆ సంస్థ కియాపై అసత్య కథనం రాయడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు హయాంలో రాయిటర్స్‌కు చేకూర్చిన ఆర్థిక ప్రయోజనాలపై జగన్ సర్కార్ సమగ్ర సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది.