తెలంగాణ అసెంబ్లీకి ఈ సారి ముందస్తు ఎన్నికలు ఉండవంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా, కేసీఆర్ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారంటున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. వచ్చే ఏడాది కచ్చితంగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు వస్తాయంటూ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
అందుకు గుజరాత్ ఎన్నికల సందర్భాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. వచ్చే ఏడాది డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ సమయంలోనే తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు రేవంత్ రెడ్డి.
ఈ విషయంలో ప్రధానమంత్రి మోడీ డైరెక్షన్లో కేసీఆర్ పని చేస్తారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. 2022తో దేశం స్వతంత్రంగా 75 యేళ్లను పూర్తి చేసుకుంటుంది. ఆ సెంటిమెంట్ తోనే గుజరాత్ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావిస్తోందని, అదే సందర్భంలో మోడీని ఫాలో అవుతూ కేసీఆర్ కూడా వచ్చే ఏడాది చివరకు అసెంబ్లీ ఎన్నికలను తీసుకొస్తాడని రేవంత్ అంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీకి చివరిసారి 2018లో ఎన్నికలు జరిగాయి, లెక్క ప్రకారం 2023 ద్వితీయార్థంలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. ఈ సారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేనట్టుగా కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాత్రం.. ఈ సారి కూడా ఏడాది ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు.
అలాగే బీజేపీ కోసం కేసీఆర్ పలు రకాల మధ్యవర్తిత్వాలు చేస్తున్నారంటూ కూడా రేవంత్ ఆరోపించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఖర్చులకు డబ్బును సమకూర్చడం, అక్కడ ఎంఐఎం పోటీ గురించి కూడా బీజేపీ కోసం కేసీఆర్ మధ్యవర్తిత్వాలు చేస్తున్నారంటూ ఆరోపించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయిన తర్వాత ఏదో కారణం చూపించి హరీష్ రావునుపార్టీ నుంచి బయటకు పంపుతారని, టీఆర్ఎస్ లో తిరుగుబాటు వస్తుందని కూడా రేవంత్ రెడ్డి అభిప్రాయపడటం గమనార్హం.