రంగురాళ్ళు కావు అవి లక్షలు తెచ్చిపెట్టే ఆయుధాలు. అందుకే రంగురాళ్ల కోసం విశాఖ ఏజెన్సీలో ఎపుడూ తవ్వకాలు జరుగుతూనే ఉంటాయి. అటు అధికారులు, ఇటు పోలీసులు కళ్ళు గప్పి మరీ జోరుగా ఈ రంగురాళ్ళ తవ్వకాలు ఈ మధ్య సాగిపోతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నా ఈ రంగురాళ్ళ తవ్వకాలతో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి.
తాజాగా విశాఖ జిల్లాలోని నర్శీపట్నం నియోజకవర్గంలోని పప్పుశెట్టిపాలెం గ్రామంలో రంగురాళ్ల తవ్వకాలు జోరందుకున్నాయి. అక్కడ క్యారీలో గత వారం రోజులుగా రంగు రాళ్ళు తవ్వకాలు నిర్వహించారని తెలుస్తోంది. సుమారు 50 లక్షల రూపాయలు వరకు అమ్మకాలు నిర్వహించినట్లుగా చెబుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా రంగు రాళ్ళు తవ్వకాలు యధేచ్చగా సారిపోతున్నాయి.
గత కొన్నిరోజులుగా జెసిపిలతో తవ్వకాలు నిర్వహించారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా అర్ధరాత్రి సమయంలో కూడా జోరుగా రంగు రాళ్ళు తవ్వకాలు చేపట్టారని అంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పొలిస్ సిబ్బంది క్యారీపై దాడి చేసి పలువురు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మొత్తానికి రంగురాళ్ళ వ్యవహారం ఎపుడూ ఏజెన్సీలో చర్చగానే ఉంటోంది. ఈజీ మనీ కోసం అలవాటు పడిన వారు, కొందరు పలుకుబడి కలిగిన వారికి సహకరించడంతో రంగురాళ్ళను ఊరకే అలా తవ్వేస్తున్నారు. విశాఖ ఏజెన్సీ అంటేనే ఒక వైపు బాక్సైట్,లాటరైట్ తో పాటు రంగురాళ్ళు కూడా అందరికీ గుర్తుకు వస్తాయి.
ఇవన్నీ అక్రమ మైనింగ్ దందాగాళ్లకు భారీ ఎత్తున ఆదాయం తెచ్చిపెట్టేవే. మరింత కట్టుదిట్టంగా అధికారులు చర్యలు చేపట్టకపోతే ఏజెన్సీ సొత్తు ఇలాగే పరుల పాలు అవుతుంది అంటున్నారు స్థానికులు.