వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత నియోజకవర్గంలో అసమ్మతి బెడద పెరుగుతోంది. నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్, చైర్ పర్సన్ కేజీ శాంతి దంపతుల షష్టిపూర్తి వేడుకలు నగరి వైసీపీలో హీట్ పెంచాయి. ఒకప్పుడు కేజే కుమార్ ఇంట్లోనే ఆశ్రయం పొందిన రోజా…ఇప్పుడు వారింటికి ఎవరైనా వెళితే అంటూ హెచ్చరికలు చేసే వరకు వారి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా కేజీ కుమార్ దంపతుల షష్టిపూర్తి వేడుకలు శుక్రవారం నగరిలో ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలకు సంబంధించి రోజా పేరిట ఓ ఆడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది. ఆ ఆడియో సారాంశం ఏంటంటే…
‘నగరి నియోజకవర్గ అభివృద్ధి కోసం, తనను గెలిపించిన కార్యకర్తల కోసం ఎంత వరకైనా వెళతాను. ఇదే సమయంలో పార్టీకి ద్రోహం చేసి, నన్ను వెన్నుపోటు పొడిచి, పది మందిలో నన్ను అవమానపరిచిన వ్యక్తుల కార్యక్రమాలకు ఎవరైనా వెళ్లాలనుకుంటే, అలాంటి వారికి ఇక మీదట పార్టీతో సంబంధం ఉండదు. నా మంచితనాన్ని చేతకాని తనంగా చూడొద్దు’ అని కేజే కుమార్ దంపతుల షష్టిపూర్తి వేడుకలకు వెళ్లే వాళ్లపై వేటు తప్పదని ఆమె పరోక్షంగా వైసీపీ శ్రేణుల్ని హెచ్చరించారు.
కాగా కేజే కుమార్ దంపతులు ఒకప్పుడు నగరిలో ముద్దుకృష్ణమనాయుడుతో ధైర్యంగా ఢీకొన్నారు. జైలుకు కూడా వెళ్లారు. అందువల్లే వీరిని జగన్ బాగా అభిమానిస్తారు. మొదట్లో వీరితో రోజాకు మంచి సంబంధాలుండేవి. నగరిలో సొంతిల్లు కట్టుకోక ముందు రోజా వాళ్లింట్లోనే ఉండేవారు. అలాంటిది వారి మధ్య గొడవ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. పైగా కేజే కుమార్ సామాజికవర్గానికి (మొదలియార్) నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఈ నేపథ్యంలో కేజే కుమార్‌తో విభేదాలు రాజకీయంగా రోజాకు నష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి.
రోజా ఆడియో రిలీజ్ మరింత కాక పెంచుతోంది. రోజా హెచ్చరికలతో నగరి నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు షష్టిపూర్తి వేడుకలకు పోలేదని సమాచారం. కానీ ఆమె ఆంక్షలు విధించడాన్ని మాత్రం తప్పు పడుతున్నారు.
అయితే ఈ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి భార్య పరంజ్యోతి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తనయుడు సుమన్, మాజీ మంత్రి చెంగారెడ్డి హాజరు కావడం గమనార్హం.