అతి చేసి గతి చెడగొట్టుకోవడం

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సోమవారం నుంచి కలక్షన్లు బాగా తగ్గాయన్నది సర్వత్రా వినబడుతున్న మాట. ఏ సినిమాకైనా సోమవార గండం తప్పదు. కానీ యీ సినిమా విషయంలో పతనం మరీ తీవ్రంగా వుందట. ఆంధ్రలో ఓ…

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సోమవారం నుంచి కలక్షన్లు బాగా తగ్గాయన్నది సర్వత్రా వినబడుతున్న మాట. ఏ సినిమాకైనా సోమవార గండం తప్పదు. కానీ యీ సినిమా విషయంలో పతనం మరీ తీవ్రంగా వుందట. ఆంధ్రలో ఓ పట్టణంలో మొదటి రోజు కలక్షన్లు రూ. 7.5 లక్షలుంటే సోమవారానికి 50 వేలకు పడిపోయింది. చాలా పట్టణాల్లో రూ.180 టిక్కెట్టున్న కింది క్లాసుల్లో జనం కనబడలేదు. ఊపు తగ్గాక రూ.40 లకే చూద్దాంలే అనుకుంటున్నారు కాబోలు. ఎలాగైనా యీ లోపునే చూసేయాలని అనుకునేవాళ్లు ఇంకో 40 ఎక్కువ పెట్టి రూ. 220 క్లాసుకి వెళ్లిపోతున్నారు. 

దీనివలన అర్థమౌతున్నదేమిటంటే ఎంత ధరైనా పెట్టి సినిమాను చూసేయాలి అనుకునే ఆత్రగాళ్ల శాతం మొదటి మూడు రోజులు మాత్రమే సినిమాను నడపగలదు. ఆ తర్వాత స్టీము తగ్గిపోయి బండి మామూలు స్పీడులోనే నడుస్తుంది. ఎన్ని కోట్లు పెట్టి తీసినా ఆర్‌ఆర్‌ఆర్ కూడా ఆ స్థాయి సినిమాయే! మాది ఆ స్థాయి కాదు, చాలాచాలా పై స్థాయి అనుకుని ఏకంగా పది రోజుల కోసం అధిక రేట్ల అనుమతి తెచ్చుకున్నారు నిర్మాతలు. ఈ అతి వలన గతి తప్పినట్లుంది. 

ఎందుకంటే థియేటర్ల వాళ్లు ఖాళీ సీట్లు చూసి ఓర్చుకోలేరు. కనీసం కింది క్లాసుల రేట్లు తగ్గించి అమ్ముకుంటారు. అయితే దాన్ని లెక్కల్లో అలా చూపలేరు. ఎందుకంటే అధిక ధరలంటూ ఫిక్స్ చేసిన తర్వాత ఎవరూ తగ్గించి అమ్మకూడదు. అలా అమ్మనిస్తే, జనాలంతా ఆ థియేటర్‌కే పరుగు పెడతారు. అందుకని హెచ్చు రేట్లకే అమ్మాం అని రికార్డులో చూపిస్తారు. 

ఆదాయాన్ని ఎక్కువ చూపి ఎక్కువ టాక్సు కట్టే ఉద్దేశం ఉండదు కాబట్టి, వచ్చిన జనమే (ఫుట్‌ఫాల్స్) తక్కువ. వారి నుంచి హెచ్చు రేట్లలో వసూలు చేసిన మొత్తం యిది అని రాసి ఎమౌంటు సరిపెడతారు. ఇలా చేసినపుడు ప్రేక్షకుల సంఖ్య అసలు కంటె తక్కువగా చూపబడి, సినిమాకు చెడ్డపేరు వస్తుంది. 

బ్లాక్‌బస్టర్ అవుతుందని ఊహించి, టిక్కెట్లు ముందుగా బుక్ చేసుకుని బ్లాక్‌లో అమ్ముకుందా మనుకున్నవాళ్లు వచ్చినకాడికి రాబడదాం అని హాలు దగ్గరే తక్కువ రేట్లకు అమ్మడం ప్రారంభిస్తే మరీ అప్రతిష్ఠ. గతంలో బాలీవుడ్‌లో ప్రత్యర్థుల సినిమాలకు యిలా రివర్స్ బ్లాక్‌మార్కెటింగ్ చేసి, సినిమాలను ఫ్లాప్ చేయించిన ఉదంతాలున్నాయి. 

ఈ అవస్థంతా ఎందుకు వచ్చిందీ అంటే హెచ్చు రేట్లు మొదటి మూడు రోజులకు మాత్రమే అడిగి వుంటే పోయేదానికి అత్యాశకు పోయి పది రోజులు అడిగేశారు. ఆ విధంగా తమ కాళ్లను తామే గొడ్డలితో నరుక్కున్నట్లయింది. ఇకముందు అధిక ధరలకు అనుమతి కోరే నిర్మాతలు యీ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆత్రగాళ్లా? ప్రేక్షకులా? ఎవరి కోసం సినిమా తీయాలి అనేది స్పష్టంగా తేల్చుకోవాలి. 

ఎందుకంటే పది రోజుల పాటు యింతింత హెచ్చు రేట్లు పెట్టి ఫ్యామిలీ ఆడియన్సు రారు. పది రోజుల తర్వాత యింకో పది రోజులు ఆగితే ఎలాగూ ఓటిటిలోనే చూసేయవచ్చు అనే భావమూ కలగవచ్చు. అది సినీనిర్మాతకే కాదు, థియేటర్లకు, సినిమా పరిశ్రమకే నష్టం. అధికధరలు కాబట్టి ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను చూడడానికి జనాలు యిచ్చగించటం లేదు అనుకోవడానికి లేదు. నార్త్‌లో, వెస్ట్‌లో హిందీ వెర్షన్‌కు ఆదరణ తగ్గిపోయింది. సోమవారం బుక్ మై షోలో చూస్తే అనేక థియేటర్లలో గ్రీనే కనబడుతోంది. 

సినిమా అంత బాగా రాలేదు అని అర్థమవుతోంది. సినిమాను బాగా తీయాలి అనుకుంటే కథాకథనాలపై దృష్టి పెడతారు. అలా కాకుండా సినిమాను ఎంత బాగా మార్కెట్ చేసుకుని, ఎంత త్వరగా పెట్టుబడి రాబట్టాలి అనే లెక్కలే వేసుకుంటే స్టార్ స్టామినా, గ్రాఫిక్స్, సెటింగ్స్, విజువల్ వండర్ యిలాటి మీదే ధ్యాస పెట్టి సినిమాను నిర్లక్ష్యం చేస్తారు.